– పెట్టుబడుల్లో 55 శాతం పతనం
– వెస్టియన్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత రియల్ ఎస్టేట్ రంగంపై విదేశీ ఇన్వెస్టర్లు అనాసక్తిగా ఉన్నారు. ఈ రంగంలో ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 55 శాతం పతనంతో 552 మిలియన్ డాలర్ల (రూ.4600 కోట్లు)పెట్టుబడులు మాత్రమే పెట్టారని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2023 ఇదే త్రైమాసికంలో 1.23 బిలియన్ డాలర్ల (రూ.10వేల కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. 2024 మార్చి త్రైమాసికంలో స్టాక్ మార్కెట్లలో ఈ విభాగంలో ఏకంగా 99 శాతం పతనంతో 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. ఈ విభాగంలో గతేడాది ఇదే త్రైమాసికంలో 791.4 మిలియన్ డాలర్ల విదేశీ నిధులు నమోదయ్యాయి. మరోవైపు గత జనవరి- మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఇన్వెస్టర్లు రియాల్టీ సూచీల్లో 21 శాతం వృద్థితో 541.1 మిలియన్ల పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఆందోళనలు, అనిశ్చితి నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల అంశంలో అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారని వెస్టియన్ సిఇఒ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. గడిచిన మార్చి త్రైమాసికంలో వాణిజ్య ఆస్తులపై అత్యధికంగా 231.6 మిలియన్ల పెట్టుబడులు పెట్టారు. గతేడాది ఇదే సమయంలో ఏకంగా 484.8మిలియన్ల పెట్టుబడులు నమోదయ్యాయి.