తుమ్మల చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి ఫారెస్ట్ అనుమతులు

– అభివృద్ధి ప్రదాతకు కృతజ్ఞతలు తెలిపిన పేరయ్య, అతహార్ 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
గుండాల మండల పరిధిలోని మామకన్ను గ్రామం నుంచి కరకగూడెం మండలంలోని బట్టుపల్లి గ్రామం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా.. ఆళ్ళపల్లి, మామకన్ను గ్రామాల మధ్య ఉన్న కిన్నెరసాని, జల్లేరు వాగులు కలిసే రెండు వాగుల గడ్డపై గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిన సుమారు 10 కోట్ల వ్యయం గల బ్రిడ్జి నిర్మాణం పనులకు ఫారెస్ట్ శాఖ అనుమతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వచ్చాయని, ఉమ్మడి పాత మండల ప్రజల తరుపున అభివృద్ధి ప్రదాత(తుమ్మల)కు కృతజ్ఞతలు ఇల్లందు పట్టణం, ఆళ్ళపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనగాల పేరయ్య, మొహమ్మద్ అతహార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 2వ తేదీన మంత్రి తుమ్మల ఇల్లందు పర్యటనలో ఉండగా ఆళ్ళపల్లి మండలంలో సుమారు దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన సమస్యలు, నిర్మాణం దశలో ఆగిన అభివృద్ధి పనులను తుమ్మల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తుమ్మల హామీ ఇచ్చిన వారంలోపే ఫారెస్ట్ అనుమతులు లేక సంవత్సరాల తరబడి నిలిచిన బ్రిడ్జి నిర్మాణం పనులకు అనుమతులు ఇప్పించడం తుమ్మల పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. 1983 నుంచి నేటి వరకు ఆళ్ళపల్లి మండలంలో అభివృద్ధి పనులైన రాయిపాడు గ్రామం వద్ద కిన్నెరసానిపై బ్రిడ్జి, అనంతోగు గ్రామం వద్ద మధ్యలో ఆగిన వంతెన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంలో తుమ్మల కృషి ఎనలేనిదని కొనియాడారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలైన ఆళ్ళపల్లి, గుండాల మండలాలు నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉండటానికి నాంది పలికింది తుమ్మల అని, నేటికి తుమ్మలపై ఉమ్మడి పాత గుండాల మండలం ప్రజలకు ఎనలేని అభిమానం ఉందంటే రెండు మండలాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రతి పల్లెపై ఆయన పట్టు, పాలనా కాలంలో ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఏపాటివో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఆళ్ళపల్లి మండల కేంద్రం నుండి అనిశెట్టిపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు మంజూరు చేయడానికి, అలాగే మామకన్ను గ్రామం నుంచి మర్కోడు మీదుగా బట్టుపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులు మంజూరు, అనుమతుల కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, ఇల్లందు నుంచి ఆళ్ళపల్లి మండలానికి ఆర్టీసీ బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.