– బోరుమన్న రైతు దంపతులు
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని కోమటిపల్లి-కొత్తూరు ప్రాంతంలో 20 ఏళ్లుగా సాగులో ఉన్న పోడుభూమిలో వేసుకున్న పత్తి పంటను ఫారెస్టు అధికారు మంగళవారం పీకేశారని కోమటిపల్లికి చెందిన బాలగాని మల్లేష్ అనూష దంపతులు బోరుమన్నారు. గ్రామానికి చెందిన సన్న చిన్నకారు రైతులు కోమటిపల్లి కొత్తూరు మధ్యలో 20 ఏల్ల క్రితం పోడుభూములు చేసుకుని ప్రతి ఏటా సాగుచేకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలు ఇచ్చే సమయంలో సైతం ఫారెస్టు అధికారులు సర్వే చేసి తిమ్మంపేట సెక్షన్ కంపార్టుమెంట్ 10 ఉందని తమకు నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా పత్తి వేసుకన్నామని ఏపుగా పెరిగిన పత్తి చేనును మంగళవారం ఉదయం పది మంది ఫారెస్టు అధికారులు తాము లేని సమయంలో వచ్చి పంటను పీకేశారని మల్లేష్ అనూష దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను పీకేసి ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
రిజర్వు ఫారెస్టులో సాగు : డీఆర్వో అరుణ
కోమటిపల్లి కొత్తూరు బీట్ పరిధిలోని 307 సర్వే నెంబర్ రిజర్వు ఫారెస్టని డిప్యూటీ రేంజి అధికారి అరుణ అన్నారు. 2022 అక్టోబర్ లో అక్రమ పోడు చేస్తున్న రైతులు ఇకపై అట్టి భూమిలో సాగు చేయమని రాతపూర్వకంగా స్టాంపు పేర్లలో రాసిచ్చారని తెలిపారు. ఇటీవల కొందరు రైతులు రిజర్వు ఫారెస్టు భూమిలో సాగు చేస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లగా భూమిలో పత్తి పంట సాగులో ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటను తొలగించినట్లు తెలిపారు. ఇకపై సర్వే నెంబరు 307 రిజర్వు ఫారెస్టు భూమిలో ఎవరు సాగు చేసినా చర్యలుంటాయన్నారు.