అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ

Forest protection and greening is a continuous process–  33 శాతం పచ్చదనం కోసం కృషి చేయాలి : హరితహారంపై సమీక్షలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అనీ, లక్షిత 33 శాతం పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో హరితహారం పురోగతి, వచ్చే సీజన్‌లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే, కనీస ఆదాయాన్ని ఇచ్చే పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పంపిణీ చేసి ఇంటి ఆవరణాల్లో పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చింత, సీతాఫలం, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమం పారదర్శకంగా పూర్తి జవాబుదారీతనంతో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానంపై వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం. దొబ్రియాల్‌, సుభద్ర, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ హనుమంతరావు, మున్సిపల్‌, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హార్టీకల్చర్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫారెస్ట్‌ అధికారులపై ఇసుక మాఫియా దాడిని ఖండిస్తున్నాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్‌ డివిజన్‌ రేంజ్‌ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులను ట్రాక్టర్‌ ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌ ద్వారా ఘటన గురించి మంత్రి తెలుసుకున్నారు. బుధవారం ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో దోషులెంతటి వారైనా ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదే శించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.అటవీ ప్రాంతంలో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలనీ, సహాయ సహకారాలు కావాలంటే తమదృష్టికి తీసుకురావాలని సూచించారు.