మాఫీ వ‌చ్చే ..పండ‌గ తెచ్చే..!

Forgiveness will come .. it will bring celebration ..!– నేటి నుంచి అమల్లోకి రుణమాఫీ ప్రక్రియ
– తొలుత రైతుల ఖాతాల్లో రూ.లక్ష వరకు జమ
– ఉమ్మడి జిల్లాలో 6లక్షల మందికి ప్రయోజనం
– ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంట రుణాల మాఫీకి సమయం రానే వచ్చింది. గురువారం నుంచి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల నుంచి పంట పెట్టుబడి కోసం తీసుకున్న రుణాలు మాఫీ కావడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ హామీ మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణం మాఫీ అవుతుండగా.. తొలుత రూ.లక్ష వరకు ఉన్న రుణం ఉన్న వారికి మాఫీ కానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో రూ.6లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చగా.. సుమారు రూ.3వేల 60కోట్లు మాఫీ కానున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా పొందుపర్చిన ఈ పథకం నేటి నుంచి అమలు కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు ఆ పార్టీ శ్రేణుల్లో సైతం సంతోషం వ్యక్తమవుతోంది. సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
అన్నదాతలు ఆశగా ఎదురుచూసిన రైతు రుణమాఫీ ప్రక్రియ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా రైతు రుణమాఫీ చేయాలని భావించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతిలో భాగంగా 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్‌ పంపిణీ, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10లక్షల బీమా సౌకర్యం అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీని కూడా పట్టాలెక్కించింది. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఈ రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్ధం కొనసాగింది. హామీ నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌, రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్‌ నేతల మద్య మాటల యుద్ధం కొనసాగింది. తాజాగా కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనున్న ప్రభుత్వం ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణం కలిగిన వారికి కూడా వర్తింపజేసేందుకు సిద్దమవుతుండటం ఆసక్తి రేపుతోంది.
6లక్షల మందికి ప్రయోజనం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. బ్యాంకుల నుంచి పంట కోసం రూ.2లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తించనున్న దృష్ట్యా ఉమ్మడి జిల్లా రైతులకు మేలు జరుగుతుంది. పాస్‌ పుస్తకం ఆధారంగా మాఫీ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఉమ్మడి జిల్లాలో 6లక్షల మంది రైతులు 17.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. 2018 డిసెంబర్‌ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 9వ వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 1.17లక్షల మంది రైతులకు ఇది వర్తించగా.. రూ.1030.61కోట్లు మాఫీ కానున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1.19లక్షల మంది రైతులు ఉండగా రూ.722.18కోట్లు, మంచిర్యాల జిల్లాలో 0.94లక్షల మంది రైతులకు గాను రూ.804.22కోట్లు, నిర్మల్‌ జిల్లాలో 1.20లక్షల మంది రైతులకు రూ.952.39కోట్లు మాఫీ కానున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష వరకు రుణం రైతులకు తొలి విడతలో 18739 మందికి మాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు.
ఏకకాలంలో రుణమాఫీ చేయాలి : బండి దత్తాత్రి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీనిచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా చేపడుతున్న రుణమాఫీ ప్రక్రియను విడతల వారీగా కాకుండా ఏకకాలంలో చేయాలి. ముఖ్యంగా రేషన్‌కార్డు ప్రామాణికం కాకుండా పాసు పుస్తకం ఆధారంగా మాఫీ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.
చాలా సంతోషంగా ఉంది : అవినాష్‌ బెదోడ్కర్‌, రైతు, కాప్సి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల పంట రుణాలు మాఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాయం కారణంగా రైతులు మరింత ఉత్సాహంగా వ్యవసాయాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అనేక మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. హామీని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.