– అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంను కోరిన పిటిషనర్
– ప్రస్తుత సభ్యులకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని వాదన
న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్ కేసుకు సంబంధించి గతంలో నియమించిన నిపుణుల కమిటీలోని సభ్యులకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని, కాబట్టి కొత్తగా కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. అదానీ గ్రూపులో అవకతవకలపై హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతమైన తర్వాత మదుపుదారుల సొమ్ము ఆవిరికావడం వెనుక దర్యాప్తు సంస్థ వైఫల్యం ఏమైనా ఉన్నదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు మార్చిలో నిపుణుల కమిటీని నియమించింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వం వహించారు. ఈ కమిటీలో మాజీ బ్యాంకర్లు కేవీ కామత్, ఓపీ భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, సెక్యూరిటీల న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జేపీ దేవ్‌ధర్ సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కొందరు సభ్యుల పేర్లను సూచిస్తూ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవరులో వివరాలు అందించింది. అయితే ఆ పేర్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సొంతగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ మే 8న సీల్డ్ కవరులో నివేదిక అందజేసింది. అయితే కమిటీలోని సభ్యులలో చాలా మందికి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ‘కమిటీ సభ్యుడైన ఓపీ భట్ ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్. ఆయన ప్రస్తుతం ప్రముఖ పునరుత్పాదక ఇంధన కంపెనీ గ్రీన్‌కోకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2022 మార్చి నుండి గ్రీన్‌కో, అదానీ గ్రూప్ కలిసి భాగస్వామ్యం కోసం కృషి చేస్తున్నాయి. దేశంలోని అదానీ గ్రూప్ సంస్థలకు ఇంధనాన్ని అందించే విషయంపై కలిసి పనిచేస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి సంబంధించి గ్రీన్‌కో సంస్థ 2022 మార్చి 14న పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది’ అని పిటిషనర్ తెలిపారు. పైగా ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ఆర్థిక నేరగాడు, మద్యం వ్యాపారి విజరు మాల్యాకు రుణాలు జారీ చేయడంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంపై భట్‌ను 2018 మార్చిలో సీబీఐ విచారించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం… 2006-11 మధ్యకాలంలో భట్ ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఉన్నప్పు డు మాల్యా కంపెనీలకు అనేక రుణాలు మంజూరయ్యాయి. మాల్యా కంపెనీల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలిసినప్పటికీ ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ఎలాంటి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించలేదు. నిపుణుల కమిటీలోని మరో సభ్యుడు కేవీ కామత్ పేరు ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. సెబీ బోర్డు సహా అనేక వేదికల ఎదుట అదానీ తరఫున న్యాయవాది సోమశేఖర్ సందరేశన్ వాదించారు. కాగా ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగిన వారి స్థానంలో ఆర్థిక, న్యాయ, స్టాక్ మార్కెట్ రంగాల నుండి అలాంటి ప్రయోజనాలు లేని నిపుణులతో కొత్తగా కమిటీని నియమించాలని సుప్రీం కోర్టును పిటిషనర్ కోరారు.