అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు

– బడుల్లో వసతులు, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
– స్వయం సహాయక బృందాలకు నిర్వహణ బాధ్యత
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(ఏఏపీసీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే కాకుండా వాటిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, వాటిద్వారా బడులను బలోపేతం చేస్తామని వివరించారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలనీ, ఆ పనులను పర్యవేక్షించాలనీ, బడులను బలోపేతం చేసేందుకు ఆ కమిటీల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, తరగతి గదుల్లో విద్యుత్‌ సౌకర్యం, పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణ వంటి పనులను ఆ కమిటీలు పర్యవేక్షిస్తాయని వివరించారు. భారీ, చిన్న తరహా మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ బిల్లులను తగ్గించడం కోసం సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫారాలను కుట్టడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గ్రామసంఘం/ఫెడరేషన్‌ ప్రాంత స్థాయి అధ్యక్షులు ఆ కమిటీలకు అధ్యక్షులుగా, ఆ పాఠశాల హెచ్‌ఎం సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడంతోపాటు పాఠశాల నిర్వహణ బాధ్యత పూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే చూస్తాయని పేర్కొన్నారు.