దోపిడీ అంతం కోసం సీపీఐ(ఎంఎల్) ఏర్పాటు అవసరం

– సీపీఐ(ఎంఎల్) నాయకులు
నవతెలంగాణ నెల్లికుదురు
 దేశవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజలపై సాగుతున్న శ్రమ దోపిడీ అంతంకై సీపీఐ(ఎంఎల్) ఏర్పాటు అవసరం అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంద తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముజంపల్లి వీరన్న, నెల్లికుదురు మండల కార్యదర్శి ఇరుగు అనిల్ డివిజన్ నాయకులు బండపల్లి వెంకటేశ్వర్లులు అన్నారు. సిపిఐ ఎంఎల్ 55వ ఆవిర్భావ దినోత్సవం, మార్క్స్ట్ మహోపాధ్యాయులు లెనిన్ 154 జయంతిని పురస్కరించుకొని నెల్లికుదురు మండల కేంద్రం, ఆలేరు, మెచరాజపల్లి గ్రామాలలో సోమవారం జెండాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగం వ్యవసాయ కూలీలు కార్మికులు నిరుద్యోగులు మహిళలు విద్యార్థులు చిన్న తరహా పరిశ్రమలు నడుపుకుంటున్న ప్రజానీకం నేటి పాలకుల విధానాల మూలంగా అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. కష్టాలను దూరం చేస్తామని 75 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న పాలకవర్గాలు ప్రజల కష్టాలను పెంచి కార్పొరేట్ బహుళ జాతి కంపెనీల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారని అన్నారు.ప్రశ్నించే గొంతుకులపై క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తూ తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని జైలు, కేసులు జైలు నిర్బంధం హత్యలు ఎన్కౌంటర్లు నిత్య కృత్యంగా మారినాయని అన్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లో కూర్చున్న పాలకవర్గాలు ముఖ్యంగా బిజెపి రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలిస్తుందని విమర్శించారు.మార్క్జం,లేనినిజం మావో ఆలోచన విధానం వెలుగులో పీడిత ప్రజలందరినీ ఐక్యం చేసి వర్గ పోరాటాలను తీవ్రతరం చేయటం కోసమే 1969 ఏప్రిల్ 22న సిపిఐ (ఎంఎల్) ఏర్పడిందని అన్నారు. నాటి నుండి దేశంలో దళితులు గిరిజనులు అట్లాడుగు వర్గాల పేద ప్రజానీకం కోసం ఎనలేని త్యాగాలు చేసి అనేక హక్కులను సాధించి పెడితే నేటి పాలకులు వాటిని ఒక కలం పూటతో రద్దు చేస్తున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా విశాల ప్రజానీకం ఐక్యమై సిపిఐ ఎంఎల్ ఏర్పాటు స్ఫూర్తితో విముక్తి పోరాటాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో శ్రద్ధ పెట్టడం లేదని ఇతర పార్టీల విమర్శిలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జక్కుల యాకయ్య, మండల నాయకులు ఈర్ల వెంకన్న కేశవులు ఎంకి యాకయ్య లెనిన్ ప్రసాద్ సైదులు తదితరులు పాల్గొన్నారు.