– గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూత
– సీపీఐ (ఎం), ‘నవతెలంగాణ’ దిగ్భ్రాంతి
– నివాళులర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, సంతాపం తెలిపిన బి.వెంకట్, ఎస్.వీరయ్య
– సీజీఎం ప్రభాకర్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి సహా పలు సంఘాలు, నేతల నివాళి
– భద్రాచలానికి భౌతికకాయం
– నేడు అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ శ్రీనివాస్ (50) హఠాన్మరణం చెందారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నారాయణగూడలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భార్య స్వర్ణ జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ మరణం పట్ల సీపీఐ (ఎం), నవతెలంగాణ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడిగా, ఆ సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, అనంతరం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పట్టణ పేదల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాశక్తి బుకహేౌస్ జనరల్ మేనేజర్‌గా సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2020 ఫిబ్రవరి వరకూ నవతెలంగాణ సీజీఎంగా పని చేశారు. ఆయన భార్య స్వర్ణ జ్యోతి భద్రాచలం జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ యూటీఎఫ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
పీవీ మరణవార్త తెలియగానే పత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఫీచర్స్ ఎడిటర్ కె.ఆనందాచారి, పలువురు మేనేజర్లు, బోర్డు సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. భార్యతోపాటు కుటుంబ సభ్యలను పరామర్శించి, సానుభూతిని వెలిబుచ్చారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ పీవీకి నివాళులర్పించారు. అనంతరం పీవీ భౌతికకాయాన్ని బాగ్‌లింగంపల్లిలో గల ఎమ్‌హెచ్ భవన్ (నవతెలంగాణ హెడ్డాఫీసు)కు తరలించారు. అక్కడ ప్రభాకర్ అధ్యక్షతన సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, టీపీఎస్‌కే కన్వీనర్ జి.రాములు, ప్రభాకర్ కలిసి పీవీ భౌతికకాయంపై ఎర్రజెండాను కప్పి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ… ప్రజా సంఘాలకు, పార్టీకి, నవ తెలంగాణకు పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను, డీవైఎఫ్‌ఐ కార్యదర్శిగా పీవీ ఒకే కాలంలో ఉన్నామని తెలిపారు. ఆ సమయంలో అనేక ఉద్యమాల్లో సమన్వయంతో కలిసి పని చేశామని తెలిపారు. విద్యార్థి, యువజన, పట్టణ పేదల సంఘంతోపాటు ప్రజాశక్తి, నవతెలంగాణకు ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం పట్ల సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
నవతెలంగాణ ఇన్‌ఛార్జి ఎడిటర్ రాంపల్లి రమేశ్, ఎస్వీకే బాధ్యులు ఎన్.సోమయ్య, జి.బుచ్చిరెడ్డి, సోషల్ మీడియా బాధ్యులు జగదీశ్, నవతెలంగాణ పూర్వ బోర్డు సభ్యులు జి.రాజకుమారి, సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె.బాబూరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్.శ్రీనివాసరావు, సీఐటీయూ నేతలు జె.వెంకటేశ్, ఎస్.రమ, శ్రీకాంత్, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, ప్రజాశక్తి బుకహేౌస్ జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య, వొరపస్రాద్, ఇన్సూరెన్స్ రంగం సీనియర్ నాయకులు కెఎస్‌ఎన్ రాజు, వ్యకాస ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీవైఎఫ్‌ఐ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.బాలకాశి, ఏపీ ప్రజా సంఘాల బాధ్యుడు నూర్ మహ్మద్‌తోపాటు నవతెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు.. పీవీకి ఘన నివాళులర్పించారు.
ఆయన మరణం పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థి, యువజనోద్యమాల్లో తామిద్దరం కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర కేంద్రానికి వచ్చిన తర్వాత పార్టీ మహాసభల నిర్వహణ, అనేక పోరాటాల్లోనూ ఆయన అత్యంత చొరవను ప్రదర్శించేవారని తెలిపారు. పీవీతోనూ, ఆయన కుటుంబంతోనూ తనకున్న అనుంబంధాన్ని ఈ సందర్భంగా వెంకట్ గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీవీ మరణం పట్ల నవతెలంగాణ పూర్వ సంపాదకులు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య తీవ్ర సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి. ఆర్.వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, కార్యదర్శి అనగాని వెంకటేశ్ కూడా పీవీ మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సంతాప సభ అనంతరం… పీవీ భౌతికకాయాన్ని భద్రాచలానికి తరలించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.