ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌

ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌– జారిపడి విరిగిన ఎడమకాలు తుంటి ఎముక
– యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స పూర్తి
– కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్న డాక్టర్లు
– కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా
– మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
– ఆస్పత్రిని సందర్శించిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ
– పరామర్శించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కె.జానారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌజ్‌లో గురువారం (డిసెంబర్‌ 7 అర్థరాత్రి) బాత్‌ రూంలో జారిపడటంతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను హైదరాబాద్‌ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట సతీమణి శోభతో పాటు కుమారుడు కేటీఆర్‌, కుమార్తె కవిత, మాజీ మంత్రి హరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులున్నారు. ఆయనకు ఎక్స్‌ రే, స్కానింగ్‌ తదితర పరీక్షలు చేసిన వైద్యులు ఎడమ కాలు తుంటి ఎముక విరిగినట్టు నిర్థారించారు. దాన్ని రిప్లేస్‌ చేయడానికి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. తను కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని చెప్పారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి బులెటిన్‌ విడుదల చేసింది. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స చేశారు..
కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ అందించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో ఆస్పత్రికి వెళ్లిన రిజ్వీ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని కోరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కె.జానారెడ్డి, ఆయన కుమారుడు, నాగార్జన సాగర్‌ నియోజకవర్గ శాసనసభ్యులు జయవీర్‌ రెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని సూచించారు. కేసీఆర్‌ ఆరోగ్యం కోసం ఇంటి వద్దనే ఉండి ప్రార్థనలు చేయాలని కోరారు. కేసీఆర్‌ కు గాయమైన సంగతి తెలిసి బాధపడ్డట్టు జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ప్రజలకు, సమాజానికి సేవలందిస్తారని ఆకాంక్షించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై తదితర ప్రముఖులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీమంత్రి కేటీఆర్‌ కు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలు
యశోద ఆస్పత్రి కేసీఆర్‌ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ మంత్రులు జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావుబీ గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.