– చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి శిష్యుడు కిషన్‌రెడ్డి : మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవ తెలంగాణ-గజ్వేల్
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రులు రంగంలోకి దిగినట్టు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో శనివారం పలు అభివృద్ధి పనులకు హౌంమంత్రి మహ్మద్‌అలీతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మరోపక్క మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి శిష్యుడు బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో నిమగమయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వేలాదిమంది రైతుల చావుకు కారణమైందన్నారు. మూడు పంటలు పండాలని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలను కడుపులో పెట్టుకొని చూసు కుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజాసంక్షేమంపై ముందుచూపుగా ఎవరు ఆలోచిస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి సమైఖ్యాంధ్ర మాజీ సీఎంలు ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గజ్వేల్ ఏసీపీ కార్యాలయానికి రూ.2.84 కోట్లు కాగా, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.16.15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతియుతంగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ బడ్జెట్లో పోలీస్ శాఖకు రూ.9,500 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ రోజా శర్మ, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్, గజ్వేల్ స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి, ఎంపీపీ అమరావతి తదితరులు పాల్గొన్నారు.