నవతెలంగాణ- కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ నిజామాబాద్ జిల్లా నుండి ఆకుల లలిత, కామారెడ్డి జిల్లా నుండి ఏనుగు రవీందర్ రెడ్డిలు ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆకుల లలిత గత వారం రోజులు క్రితం రాహుల్ గాంధీ నిజాంబాద్ జిల్లా కొచ్చిన సందర్భంలో పార్టీలో చేరే ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. పార్టీలో ఆకుల చేరితే టికెట్ కూడా ఆమెకే అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్స్ శాసనసభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆనాడు ఓటమి పాలయ్యారు. అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ తిరిగి రావడంతో ఆకుల లలిత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజాంబాద్ అర్బన్ స్థానంలో మున్నూరు కాపులు బలమైన సామాజిక వర్గంగా ఉండడంతో ధర్మపురి సంజయ్, ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పోటీపడుతున్నారు. పార్టీలో చేరే సందర్భంలోనూ ఆకుల లలితకు ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఏదేమైనాప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అటు ప్రజలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ రూరల్ తో పాటు కామారెడ్డిలోనూ అభ్యర్థులను ఖరారు చేయవలసిన పరిస్థితి ఉన్నది అయితే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో సుమారు ఉన్న 15 నుండి 20 రోజుల్లో ఎలా అభ్యర్థి పోటికి సిద్ధమవుతాడని ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు, అలాగే నామినేషన్ సమయం కూడా దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో అధిష్టానం మైనార్టీ పై మాత్రమే దృష్టి సారించింది అన్న వినికిడి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మైనారిటీ నేత ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసి గెలుస్తాడా లేదా అని కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలాడుతున్నారు.