భోపాల్ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్ నేతలు కాంగ్రెస్‌కి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ ఎంపీలు బీజేపీలోకి చేరారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పలువురు సీనియర్ నేతలు బీజేపీ లోకి చేరారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరి, మాజీ ఎంపీ గజేంద్రసింగ్ రాజుఖేడి, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు ఈరోజు బీజేపీ లోకి చేరారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విడి శర్మ, మాజీ సీఎం శిరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో భోపాల్‌లో బీజేపీ పార్టీ కార్యలయంలో వీరంతా బీజేపీ లోకి చేరి ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు అయిన సంజరు శుక్లా, అర్జున్ పాలియా, విశాల్ పటేల్‌లు కూడా బీజేపీలోకి చేరిన వారిలో ఉన్నారు.
కాగా, పచౌరి గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి (డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ సప్లైస్)గా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. అలాగే కాంగ్రెస్‌లో కీలక పదవుల్లోనూ పచౌరి పనిచేశారు. మధ్యప్రదేశ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
మాజీ ఎంపీ రాజుఖేడి గిరిజన నాయకుడిగా పేరొందారు. కాంగ్రెస్ టికెట్‌పై మూడుసార్లు ఎంపీగా 1998, 1999, 2009లో మూడు పర్యాయాలు ధర్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే ఈయన కాంగ్రెస్‌లో చేరకుముందు 1990లో బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.