– ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు
– అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావుని విచారిస్తున్న స్పెషల్ టీం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కలకలం రేపిన ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు నగర టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును తదుపరి విచారణ కోసం ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ.. నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గురువారం 4వ తేదీ నుంచి పదో తేదీ వరకు రాధాకిషన్ రావును ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న పంజాగుట్ట స్పెషల్ టీం పోలీసులకు కస్టడీకి ఇస్తూ.. న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇతన్ని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోరారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్‌రావు వ్యవహరించి నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాధాకిషన్‌రావు తాను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉపఎన్నికల సమయంలో వారి వాహనాల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు సీజ్ చేసినట్టు అంగీకరించాడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక అప్పటి అధికార పక్షానికి చెందిన కీలక నాయకులు రాధాకిషన్ రావుకి ఆదేశాలిచ్చారని వస్తున్న ఆరోపణలపై ఈ కస్టడీ సమయంలో దర్యాప్తు అధికారులు కూలకషంగా దర్యాప్తు చేసే అవకాశముంది. మరోవైపు ఈ కేసులో అనుమానితుడైన మరో రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావుని బుధవారం దర్యాప్తు అధికారులు నోటీసులిచ్చి పిలవడంతో ఆయన విచారణకు హాజరయ్యాడు. ఉదయం నుంచి రాత్రి వరకు వేణుగోపాల్ రావు విచారణ కొనసాగినట్టు తెలిసింది. అధికార పక్షానికి అనుకూలంగా విపక్ష నాయకులకు చెందిన ఫోన్ ట్యాఫింగ్ చేసి వారి కదిలికలపై నిఘా వేయడానికి ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన ఎస్‌ఐఈబీ స్పెషల్ టీంలో వేణుగోపాల్ రావు కూడా ఒక సభ్యుడని ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో వెలుగుచూసింది. దీంతో ఈయ నను కూడా అధికారులు క్షుణంగా విచారిస్తున్నట్టు తెలిసింది. ఈయనను కూడా ప్రత్యేక టీం అధికారులు అరెస్టు చేసే అవకాశముందని సమాచారం.