– ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలోకి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న
– విచారిస్తున్న స్పెషల్ టీం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన విపక్ష ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసులో నగర మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకి 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ.. నాంపల్లి 14వ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాధాకిషన్ రావును పంజాగుట్ట స్పెషల్ టీం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు గురువారం ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు ఫోన్ ట్యాపిం గ్ అంశంపై సుదీర్ఘంగా విచారిం చారు. ముఖ్యంగా నగరం లో కొందరి ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌తో పాటు మరికొంద రు హవాలా వ్యాపారులను బెదిరి0చి వారి నుంచి డబ్బులు దండుకున్నారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అనంతరం డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిసి ప్రతిపక్షానికి చెందిన ఎంతోమంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారనే విషయంపై కూడా ఆరా తీసినట్టు తెలిసింది. అదే సమయంలో కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు శుక్రవారం అదుపులోకి తీసుకున్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలతో కలిపి రాధాకిషన్‌రావుని అధికారులు విచారించిన ట్టు తెలిసింది. ప్రధానంగా ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డారని రాధాకిషన్‌రావుని పలుమార్లు దర్యాప్తు అధికారులు నిలదీసినట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు కూడా తాము తమ పైఅధికారి(ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్‌రావు) ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు సమాధానం ఇచ్చారని తెలిసింది. మరోవైపు కొందరి అప్పటి పొలిటికల్ బాసులు ఇచ్చిన ఆదేశాల ను కూడా అమలు చేశారా అనే ప్రశ్నకు వీరు సమాధానాలు దాటవేసినట్టు తెలిసిం ది. నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు తన కింద ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొందరి వ్యాపారస్తులు, బంగారు షాపుల యజమాను ల ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి వారి నుంచి డబ్బులు దండుకున్నారా అనే కోణంలో కూడా స్పెషల్ టీం అధికారులు రాధాకిషన్ రావుని ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యాహ్నం 3గంట లకు విచారణను పూర్తిచేసి అరెస్టు చేసిన రాధాకిషన్ రావును సాయంత్రం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో పంజాగుట్ట పోలీసులు హాజరుపరిచారు. ఈ మేరకు రాధాకిషన్‌రావును 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులపై కొత్తగా టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులను నమోదు చేస్తున్నట్టు ఒక మెమోను కూడా దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పిం చారు. కాగా మరోవైపు ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మరింత లోతుగా విచారించి ఫోన్ ట్యాపింగ్‌లకు సంబంధించిన వివరాలను సేకరించడానికి దర్యాప్తు అధికారులు సిద్ధమయ్యారు. వీరిచ్చిన సమాచారం మేరకు మరికొందరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఇందులో ఒక డీసీపీ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలిసింది.