మహిళలు ఆర్థికంగా ఎదిగాలి: మాజీ మంత్రి హరీష్ రావు

– ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ
– గౌడ్ కమ్యూనిటీ హాలు ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 
మహిళలు ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్ళ ఫై తాము నిలబడాలి అన్నదే నా తపన అని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు, చంద్లాపూర్ గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ పొందిన 300మంది మహిళకు ఉచితంగా కుట్టు మిషన్ లు హరీష్ రావు పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ … మహిళల చైతన్యం.. ప్రతి రంగం లో మీ స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2200 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చామని, రూ.10వేలు విలువ గల మిషన్ లు కూడా ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. గత ఎండాకాలం ఈ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయించి చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యామ్ లను నింపుకున్నామనీ, నిండు ఎండా కాలంలో కూడా పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నట్లు తెలిపారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం చేస్తూ నీళ్లు విడువడం లేదని ఆరోపించారు. నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. చిన్న కోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్ ని జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మతో మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించి మాట్లాడారు. ఎల్లమ్మ దయతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి జరిగిందని, రూ.20లక్షలతో ఈ కమ్యూనిటీ భవనం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే చిన్నకోడూరు మండలంలో ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీరు ఉందంటే కాళేశ్వరం వల్లే, కెసిఆర్ వల్లే అని అన్నారు. కెసిఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామని, వైన్స్ టెండర్ల లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చామని గుర్తు చేశారు. ఎంపిపి కూర మాణిక్య రెడ్డి, సొసైటీ చైర్మన్లు సదానందం, కనకరాజు,  మాజీ ఎంపిపి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు గౌడ సంఘము సభ్యులు తదితరులు పాల్గోన్నారు.