నిరంతరం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అన్నారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు ఆధ్వర్యంలో హరీష్ రావు ప్లెక్సీని దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం తన మంత్రి పదవికే రాజీనామా చేశాడని, పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని అన్నారు.నిరంతరం పేద ప్రజల కోసం తపించే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ హయంలో కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు దొరల పాలన సాగించారని విమర్శించారు. పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ద్వజమెత్తారు. ఆ పార్టీపై విసుగు చెంది ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు.ఇప్పటికైనా హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, యూత్ కాంగ్రెస్ నాయకులు పాదం అనిల్, జహంగీర్ బాబా, పి.నాగార్జున, బి.ప్రసాద్, ఎం. సాయిరాం, వంశీ, నందిని, రంజిత్ ,రాకేష్ ,సతీష్, టోనీ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.