సామాజికంగా వెనకబడిన గిరిజన రైతుల అభివృద్ధికి విద్యుత్ శాఖ అధికారులు సహకరించాలని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉసిర్లగూడెంలో ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం మాజీ సర్పంచ్ మొడియం నాగమణి నివాసంలో స్థానిక గిరిజన రైతులు, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. సాగు భూములు ఉన్న గిరిజనులు పొలాల్లో బోర్లు వేయించుకోవాలి. వాటికి అవసరమైన త్రీ ఫేజ్ విద్యుత్ లైన్లను రాయితీ ద్వారా మంజూరు చేయించే బాధ్యత నాదేనన్నారు. గిరిజనుల వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ లను అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఏడీఈ వెంకట రత్నం, ఏఈఈ సంతోష్, ప్రముఖ నాయకులు కోటగిరి సీతారామస్వామి, కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, పీ లక్ష్మయ్య, మొడియం సూర్య చంద్ర రావు, గిరిజన రైతులు పాల్గొన్నారు.