సాగర్‌లో మాజీ ఎమ్మెల్యే భగత్‌ నివాసం సీజ్‌

సాగర్‌లో మాజీ ఎమ్మెల్యే భగత్‌ నివాసం సీజ్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌కు సాగర్‌లో కేటాయించిన ఇంటిని అధికారులు సీజ్‌ చేశారు. నందికొండ మున్సిపాలిటీ హిల్‌ కాలనీలోని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ నివాసమున్న ఈఈ 19 నెంబర్‌ గల ఇంటిని మంగళవారం సాయంత్రం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని వస్తువులను ఎన్‌ఎస్పీ స్టోర్‌ రూమ్‌కు తరలించారు. ఈ విషయంలో సాగర్‌ డ్యామ్‌ ఈ.ఈ మల్లికార్జునరావును వివరణ కోరగా.. ఆ ఇంటిని గతంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య క్యాంప్‌ ఆఫీస్‌ పేరు మీద అలాట్‌మెంట్‌ చేసినట్టు చెప్పారు. దానిపై ప్రభుత్వ నిధులతో మరమ్మతులు కూడా చేయించారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్నికైనందున ఆ నివాసాన్ని వారికి అప్పగించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో పలుమార్లు నోటీసులు అందజేసినా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ నుంచి స్పందన రాలేదన్నారు. దీంతో కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం మంగళవారం రాత్రి సామగ్రిని తరలించి, ఇంటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ కుమార్‌ను వివరణ కోరగా, సాగర్‌లో తాను నివాసముంటున్న ఇంటిని తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎన్‌ఎస్పీ అధికారులు స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా పోరాటం సాగిస్తామన్నారు.
బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన
మాజీ ఎమ్మెల్యే ఇంటిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుసుకొని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు.