గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గురువారం గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ తన ప్రజలను బాహ్య ప్రపంచం నుండి రక్షించడానికి పోరాడాడనీ, ఆయన చేసిన అవగాహన, చేపట్టిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా లంబాడాలు, బంజారాలకు రక్షణ కవచంగా పనిచేశాయన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన బోధనలు, ఆయన చేసిన కృషి గతంలో బంజారాలకు స్ఫూర్తిదాయకమని, ఆయనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలకు ఆధ్యాత్మిక గురువుగా, ఆరాధ్యదైవంగా తీర్చిదిద్దారని అన్నారు. గతంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు బంజారా, లంబాడా వర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసి, గ్రామ పాలనలో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ‘మా భూమిలో మన పాలన’ అనే వారి దీర్ఘకాల పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చిందని తెలిపారు. గిరిజన పిల్లల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో అనేక పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.