మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయం

మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయం– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు :చిట్యాలలో నర్రా వర్ధంతి సభ
నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయమని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. రాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం చెరుపల్లి మాట్లాడుతూ.. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాఘవరెడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. జీవితాంతం ప్రజల కోసమే పనిచేశారన్నారు. రాఘవరెడ్డి శిష్యుడిగా తాను ఎంతో గర్విస్తున్నానన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే రాఘవరెడ్డికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, నాయకులు శీలా రాజయ్య, బొబ్బిలి సుధాకర్‌ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు గుండాల యాదయ్య, చంద్రమౌళి, బొబ్బిలి వెంకట్‌రెడ్డి, కొంపెల్లి రమేష్‌, నలపరాజు శేఖర్‌ పాల్గొన్నారు.