అధికారుల బాధ్యతా రాహిత్యం వల్లనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని, ప్రాజెక్ట్ కట్ట తెగిపోవడంతో గుమ్మడవల్లి పరిసర ప్రాంత గ్రామాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసాయి అని రాబోయే రెండు పంటలు పండించే అవకాశం లేకుండా పోయిందన్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి ఎనలేని వానలతో సామర్ధ్యం మించిన ప్రాజెక్టులోకి వరద చేరిన కారణంగా ప్రాజెక్ట్ కు గురువారం గండి పడి అపార నష్టం వాటిల్లింది. ఈ నేపద్యంలో శనివారం ఆయన ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని అధికారులతో మాట్లాడారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ 1982 లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ ప్రాజెక్టు నిర్మించారన్నారు.పెద్దవాగు ప్రాజెక్టులో 16 వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతుందని, అందులో తెలంగాణ పరిధిలో 2400 మిగతా ఆయకట్టు మొత్తం ఆంధ్రాలో ఉండడం వాళ్ళ ఇరు రాష్ట్ర ప్రభుత్వ లు చొరవ తీసుకొని వెంటనే ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.పంట, గొర్రెలు,మేకలు,పశువులు నష్టపోయిన వారికీ తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని,ప్రాజెక్టు గండి పడటంతో ఈ ప్రాంత ప్రజలు పంట పండించే ఆదరువును కోల్పోయారు కనుక వారికీ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట జడ్పీటీసీ మాజీ సభ్యులు అంకిత మల్లికార్జున రావు గారు,ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్ట రాజులు,బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్,సత్యవరపు సంపూర్ణ,మోటూరు మోహన్, తదితరులు పాల్గొన్నారు.