నవతెలంగాణ – గంగాధర
గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు కల్పించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సీజ్ చేసిన సాంచెలను పరిశీలించి పవర్ లూమ్స్ కార్మికుల ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఎంతో ధీమాగా బతికిన చేనేత, పవర్ లూమ్స్ కార్మికులు ప్రస్తుతం పనులు లేక బాధపడుతున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పవర్ లూమ్స్ కు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తికి ఎటువంటి ఆర్డర్లు కల్పించక పనులు లేక అవస్థ పడుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓ వైపు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక నేతన్నలు అవస్థ పడుతుంటే మరో వైపు చేనేత జౌళిశాఖ విజిలెన్స్ అధికారు పవర్ లూమ్స్ గుడ్డ ఉత్పత్తులపై దాడులు చేస్తూ కేసులు పెట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకుల అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ వైకరి వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులు ఇవే పరిస్థితులు మరి కొంతకాలం కొనసాగితే ఆకలి చావులు, ఆత్మహత్యలు గతంలో లాగా పునరావృతం కాక తప్పవన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు కల్పించి నేత పరిశ్రమలను ఆదుకోవల్సిన అవసరం ఉందని, విజిలెన్స్ అధికారులు చేసిన కేసులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బతుకుదెరువు కోసం నేత కార్మికులు ఎటువంటి గుడ్డ, చీరలు తయారు చేసిన దాడులు చేయెాద్దని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. చేనేత, పవర్ లూమ్స్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, నేతన్నలు అధైర్యపడవద్దని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గర్శకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్ కు 2022 లో 17 ఎస్ఎస్ఐ యూనిట్లుగాను 20 లక్షల మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డర్ కల్పించగా, 2023 లో 33 ఎస్ఎస్ఐ యూనిట్లకుగాను 32 లక్షల 26 వేల 750 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించడం జరిగాయని అన్నారు. చీరలు లేని సమయంలో 2 లక్షల 13 వేల 860 మీటర్ల స్కూల్ యూనిఫామ్స్ బట్ట ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వగా, 24 వేల మీటర్ల రంజాన్ గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్ కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె వెంట బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మాజీ సర్పంచు వేముల దామెాధర్, బీఆర్ఎస్ నాయకులు ఉప్పుల గంగాధర్, రామిడి సురెందర్, వస్త్రోత్పత్తి వ్యాపాల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభతోపాటు పలువురు వ్యాపార సంఘమ నాయకులు పాల్గొన్నారు.