నవతెలంగాణ-కాశిబుగ్గ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులను కోటేశ్వరులను చేస్తానని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తన పాలనలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువ నమోదు అవుతున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధిగాంచిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంక టస్వామి అన్నారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో జరిగిన సమావేశంలో వివేక్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కొంతమందికే చేసిందని, కేంద్రం నుండి దక్కవలసిన ఇన్ పుట్, ఇతర సబ్సిడీ లను రైతులకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.10వేలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోవడం దారుణం అన్నారు. అదేవిధంగా ప్రకతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేంద్ర అమలు చేస్తున్న పసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రైతుబంధు పథకం వల్ల ధనవంతులైన భూస్వాములు మాత్రమే బాగుపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బిజెపి వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రావు పద్మ సీనియర్ నాయకులు మురళీధర్ రావు, డాక్టర్ పెసరు విజరు చంద ర్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, తిరుపతి రెడ్డి, రత్నం సతీష్, బాకు హరి శంకర్, శ్రీనివాస్ గుప్తా, తాబేటి వెంకట్ గౌడ్, కందిమల్ల మహేష్ పాల్గొన్నారు.