– ఆయన మరణం దేశానికి తీరని లోటు : మంత్రులు సీతక్క, కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాన మంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగల నాయకుడనీ, ఆయన మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క), రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. దేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దార్శనీకుడని గుర్తుచేశారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన కృషి, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక సుశిక్షితుడైన సైనికుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయమే తన నిర్ణయంగా శిరసావహించిన మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు హక్కుగా కల్పించిన ఘనత మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో చట్టాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్ చిత్తశుద్ది, ప్రజాసేవ పట్ల అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ విషాద తరుణంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తమ సానుభూతి తెలిపారు.ఞ