ఫార్ములా ఈ రేసు లేనట్టేనా?!

Formula doesn't have this race?!– తెలంగాణ ప్రభుత్వంతో ఎఫ్‌ఐఏ ప్రతినిధుల చర్చలు
– షెడ్యూల్‌ ప్రకారం సాగటం కష్టమేనని అంచనా!
నవతెలంగాణ-హైదరాబాద్‌: 2013 ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ రేసు అనంతరం భారత్‌లో జరిగిన ఏకైక ఎఫ్‌ఐఏ ఫార్ములా రేసు హైదరాబాద్‌ ఫార్ములా ఈ. హుస్సేన్‌ సాగర్‌ తీరాన స్ట్రీట్‌ సర్య్కూట్‌లో ఫార్ములా ఈ రేసును నిర్వహించారు. ఈ రేసు హైదరాబాద్‌ వాసులను సరికొత్త అనుభూతిని మిగిల్చగా.. నిర్వాహకులకు కాసుల పంట కురిపించింది. హైదరాబాద్‌ ఈ రేసు బిజినెస్‌పై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమోబైల్‌ అధికారికంగా ప్రకటన చేసింది. తొలుత ఎఫ్‌ఐఏ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ ఈ రేసుకు చోటు దక్కలేదు. కానీ మాజీ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో హైదరాబాద్‌ ఈ రేసును జాబితాలో చేర్చారు. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ ఈ రేసు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త సర్కార్‌ ఇటీవల పంపిన ఓ లేఖతో హైదరాబాద్‌ ఈ రేసు నిర్వహణపై ఎఫ్‌ఐఏకు అనుమానాలు నెలకొన్నాయి. దీంతో దీనిపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది.
స్పష్టత ఇవ్వండి!: ‘ఫార్ములా ఈ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లు ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన హైదరాబాద్‌ ఈ రేసుపై 2023 అక్టోబర్‌ 30న రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఒప్పందం ప్రకారం రేసు సాగేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై ఎఫ్‌ఐఏ అత్యవసరంగా తెలుసుకోవాలని అనుకుంటుంది. లేఖలోని అంశాల ప్రకారం రేసు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తారా? లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఏ ప్రతినిధులు ఇటీవల కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి’ అని ఎఫ్‌ఐఓ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రేసు నిర్వహణపై ఆసక్తి చూపకపోతే.. భారత్‌ ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ ఏబీబీ రేసు ఆతిథ్య హక్కులు చేజార్చుకునే ప్రమాదం ఉంది.