ప్రతి మురుగునీటి చుక్కనూ శుద్ధి చేస్తాం ,మూసీపై బ్రిడ్జిలకు త్వరలో శంకుస్థాపన

– ఆగస్టు 15న సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ ప్రారంభం
– త్వరలో మల్లంపేట్‌ వద్ద 21వ ఇంటర్‌చేంజ్‌
– మెహదీపట్నం స్కైవేపై ప్రధాని తీపికబురు అందించాలి : నార్సింగి ఇంటర్‌చేంజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, గండిపేట
హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జీల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్‌ఆర్‌ పరిధిలో రూ.29.50 కోట్లతో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్మించిన ఇంటర్‌చేంజ్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ శనివారం పారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. ఔటర్‌ చుట్టూ పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరికొన్ని ఇంటర్‌చేంజ్‌లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ తర్వాత త్వరలో ఔటర్‌పై 21వ ఇంటర్‌ చేంజ్‌ మల్లంపేట వద్ద అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 15న సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ ప్రారంభం ఉంటుందన్నారు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లను ఫోర్‌ లైన్‌ రోడ్లుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, ఔటర్‌ సర్వీస్‌ రోడ్ల విస్తరణ చేపడతామని చెప్పారు. మెట్రో రైలును బీహెచ్‌ఈఎల్‌, ఫార్మాసిటీ, కందుకూరు వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
మూసీనది అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో బ్రిడ్జీల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. మొత్తం 14 బ్రిడ్జీలలో ఐదు బ్రిడ్జీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలిపారు. మూసీపై సుమారు రూ.10వేల కోట్లతో 55 కిలోమీటర్ల మేరకు ఎక్స్‌ప్రెస్‌ స్కైవే నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో హైదరాబాద్‌ పౌరుల సౌకర్యార్థం మెహదీపట్నం స్కైవాక్‌ నిర్మాణం కోసం అరెకరం రక్షణ శాఖ స్థలాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా తమ వినతులపై తీపికబురు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఆర్వింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రభాకర్‌, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ హెచ్‌జిసిఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, డైరెక్టర్‌(ప్లానింగ్‌) బాలకృష్ణ, ఎమ్మెల్సీలు మహేందర్‌ రెడ్డి, శంబీపూర్‌ రాజు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, హెచ్‌జిసిఎల్‌ సిజీఎం రవీందర్‌, ఎస్‌ఇలు హుస్సేన్‌, పరంజ్యోతి, నార్సింగి ఇంటర్‌చేంజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అప్పారావు పాల్గొన్నారు.
ప్రతి మురుగునీటి చుక్కనూ శుద్ధి చేస్తాం 
ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తామని, ప్రతి మురుగు నీటి చుక్కనూ శుద్ధి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. మూడు ప్యాకేజీల్లో రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మించిన మొదటి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధి కోసం చేసిన ప్రణాళికలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. కోకాపేటలో 15 ఎంఎల్‌డీల సామర్థ్యంతో, రూ. 41 కోట్లతో నిర్మించిన మొదటి ఎస్టీపీ ప్రారంభంతో దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరబాద్‌ అవతరిస్తుందన్నారు. హైదరాబాద్‌లో నిత్యం దాదాపు 2000 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి అవుతోందని, సెప్టెంబర్‌ చివరి నాటికి నగరంలో ఉత్పన్నమయ్యే ప్రతి మురుగునీటి చుక్కనూ శుద్ధి చేయబోతున్నామని తెలిపారు.దేశంలోని ఏ నగరంలోనూ 40శాతం కూడా మురుగు శుద్ధి చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం రూ.3866 కోట్లతో 1259ఎంఎల్‌డీల సామర్థ్యంతో మొత్తం కొత్తగా 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టిందని, అన్నీ ఎస్టీపీలను సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేస్తామని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు అందిస్తున్నామని, దీనికోసం ఇప్పటిదాకా రూ.850 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి ఎస్టీపీలోని మొదటి ప్రక్రియగా పిలిచే వెట్‌వెల్‌ మోటార్‌ను ఆన్‌ చేసి ప్రారంభించారు. జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితా హర్‌నాథ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఆర్వింద్‌ కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌బాబు ఇతర ఉన్నతాధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.