టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

– పాల్గొన్న టీటీడీ చైర్మెన్‌ వైవీ.సుబ్బారెడ్డి, మంత్రి గంగుల
నవతెలంగాణ – కరీంనగర్‌
టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్‌ వైవీ.సుబ్బారెడ్డి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పద్మానగర్‌ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వేదపండితులచే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని కృపతోనే కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు. ఆలయ అనుమతి కోసం కరీంనగర్‌ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాయడం, కరీంనగర్‌లో పదెకరాల స్థలాన్ని కేటాయించడం, తదనంతరం ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేయడం చాలా సంతోషకరమన్నారు. టీటీడీ రూ.20 కోట్లతో ఆలయాన్ని నిర్మిస్తుందని, మిగతా నిర్మాణ నిధులను తామే సమకూర్చుకుంటామన్నారు. టీటీడీ చైర్మెన్‌ వైవీ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ తరఫున రూ.20 కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌లోనే టిటిడి అర్చకులకు ప్రత్యేకంగా వసతి నిర్మాణంతోపాటు, సమస్త కైంకర్యాలను ఆగమ శాస్త్ర పద్ధతుల్లో చేస్తామన్నారు. అలాగే, రాత్రి శ్రీనివాసుని కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి, సుంకే రవిశంకర్‌, ఎమ్మెల్సీలు, విప్‌లు భానుప్రసాద్‌రావు, కౌశిక్‌ రెడ్డి, టీటీడీ లోకల్‌ అడ్వైజరీ కమిటీ చైర్మెన్‌ భాస్కర్‌రావు, సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అనిల్‌ కుర్మాచలం, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ అనిల్‌ కుమార్‌గౌడ్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ రుద్రరాజు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రెడ్డవేణి మధు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.