– రవీంద్రన్‌ను తొలగించాలి
– కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి
– ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలి
– ఎన్‌సిఎల్‌టిలో ఇన్వెస్టర్ల గ్రూప్ దావా
బెంగళూరు : ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకులపై ఇన్వెస్టర్ల గ్రూపు ఎదురు తిరిగింది. కంపెనీ బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.. సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ అడిట్ చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్లతో బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో నలుగురు ఇన్వెస్టర్ల గ్రూపు శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. దావా వేసిన ఇన్వెస్టర్లలో ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, సోఫినా, పీక్ ఎక్స్‌వి ఉన్నాయి. వీరికి టైగర్, ఓల్ వెంచర్స్ వంటి వాటాదారుల మద్దతూ ఉంది. కంపెనీలో షేర్ హోల్డర్ల వాటాల విలువ కరిగిపోకుండా చూడటంతో పాటు ఉద్యోగులు, వినియోగదారులు ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కంపెనీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బైజూస్ యాజమాన్యం వేధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించింది.
అసాధారణ వార్షిక బోర్డు జరుగుతున్న రోజే ఎన్‌సిఎల్‌టిని ఇన్వెస్టర్ల గ్రూప్ ఆశ్రయించడంతో వారు బైజూస్ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కంపెనీని నడిపించేందుకు సిఇఒ రవీంద్రన్ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్‌సిఎల్‌టిని కోరారు. ఇటీవలే ముగిసిన రైట్స్ ఇష్యూను సైతం రద్దు చేయాలని అన్నారు. ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి కార్పొరేట్ చర్యలను కంపెనీ యాజమాన్యం తీసుకోకుండా నిలువరించాలని సూచించారు. వ్యవస్థాపకుల ఆర్థిక అవకతవకల వల్ల కంపెనీ అనుబంధ విభాగమైన ఆకాశ్‌పై నియంత్రణ కోల్పోతున్నామని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు బైజూస్ ఆల్ఫా దివాలా దశకు చేరుకుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కార్పొరేట్ పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర డైరెక్టర్ సహా సిఎఫ్‌ఒ నియామకం నిలిచి పోయాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగపూర్‌కు చెందిన నార్త్‌వెస్ట్ ఎడ్యుకేషన్ కంపెనీ కొనుగోలు విషయంలో అనధికారిక కార్పొరేట్ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.