ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు విడుదల చేయాలి

– ఉద్యోగ విరమణ పొందిన వారికి బాండ్లు ఎలా ఇస్తారు!
– మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు
నవతెలంగాణ-గజ్వేల్‌
ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తక్షణమే నాలుగు డిఏలు ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి గజ్వేల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలోదొక్కి ఎన్నికల కోడును ముందుకు వేస్తుందన్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసి వెంటనే నాలుగు డీఏలను అమలు చేయాలన్నారు. క్యాబినెట్‌ మీటింగ్‌లో ఉద్యోగులకు సంబంధించిన డిఏల పై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్‌ వచ్చిందని సాకుతో చేతులు దులిపేసుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని, కానీ ప్రభుత్వం బాండ్లు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల ఉద్యోగులు భవిష్యత్తు నిలబెట్టుకున్నందుకు అవసరం ఉన్న డబ్బును చెల్లించాలన్నారు. బాండ్లు ఇస్తే బాగుండదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారో చెప్పాలన్నారు. పెేదలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. గొర్రె కాపరులకు ఇప్పటివరకు పంపిణీ లేదని కట్టిన డీడీలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మాటలు కోటలు దాటుతున్నాయని, పని మాత్రం గడప దాటడం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నేతి చిన్న రాజమౌళి పాల్గొన్నారు.