నాలుగు రోజులు వర్షాలు

– 20న పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరిక జారీ
– సీఎం మెదక్‌ జిల్లా పర్యటన 23కి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈ నెల 20న కొమరంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించారు. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ నివేదిక ప్రకారం బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 48 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అత్యధికంగా 27 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సీఎం కేసీఆర్‌ ఈనెల 19న మెదక్‌ జిల్లాలో తలపెట్టిన పర్యటనను వర్షాల నేపథ్యంలో 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.