వడదెబ్బకు నలుగురు మృతి

For sunburn Four died– ఎలక్షన్‌ ట్రైనింగ్‌లో ఉపాధ్యాయుడు..
– చొప్పదండిలో ఎంఈఓ..
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌/చొప్పదండి/చెన్నారావుపేట
తీవ్రమైన ఎండ.. వడగాడ్పులకు జనం విలవిల్లాడుతున్నారు.. ఎండసెగ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు ఎన్నికల శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుడు కాగా, మరొకరు చెక్‌పోస్టు వద్ద విధుల్లో పాల్గొన్న ఎంఈఓ ఉన్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హుస్నాబాద్‌ మండలంలోని బల్లునాయక్‌ తండాకు చెందిన లకావత్‌ రామన్న(45) అక్కన్నపేట మండలంలోని యాటకర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జిటిగా పని చేసేవారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎలక్షన్‌ విధులకు వెళ్లారు. శుక్రవారం శిక్షణ సమయంలో రామన్నకు వడదెబ్బ తగిలింది. వెంటనే తోటి సిబ్బంది గజ్వేల్‌ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఇంటికెళ్లాడు. రాత్రి పరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామన్న శనివారం మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
చొప్పదండిలో ఎంఈఓ బత్తుల భూమయ్య మృతి
కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన ఎంఈఓ బత్తుల భూమయ్య(57) జగిత్యాల జిల్లా వెల్గటూర్‌, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల్లో ఎంఈఓగా విధులు నిర్వహి స్తున్నారు. సర్పంచుల పదవీకాల ముగియడంతో ముత్తునూరు, కప్పారావుపేట, ముప్పారావు పల్లిలో ప్రత్యేక అధికారిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఎండపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలయ్యాయి. ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చొప్పదండికి వచ్చారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మరో ఇద్దరు మృతి
వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అక్కల్‌ చెడలో వడదెబ్బతో ఆకుల భాస్కర్‌ (25), వృద్ధుడు బాదవత్‌ నరసింహ చనిపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్‌ గ్రామానికెళ్లి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పులి చేరు రాజేందర్‌, మాజీ ఉప సర్పంచ్‌ వీరన్న, రాజేందర్‌, చందర్‌, చిలుక రామక్క, ఒంటరి రాజు, రవి, శివ ,అశోక్‌, సురేష్‌, రాకేష్‌, రాజు, రమేష్‌, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.