– 70మంది ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయిల్
గాజా సిటీ : తమవద్ద బందీలుగా వున్న నలుగురు ఇజ్రాయిలీ మహిళా సైనికులను హమాస్ కార్యకర్తలు శనివారం గాజాలోని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. అప్పగించడానికి ముందు వారిని జనాల ఎదుట ప్రదర్శనగా తీసుకువెళ్లారు. గాజా నగరంలోని పాలస్తీనా స్క్వేర్ వద్ద గల వేదికపై నిలుచుని ఆ నలుగురు మహిళలు నవ్వుతూ వేలాదిమంది ప్రజలకు చేయి ఊపుతూ కనిపించారు. వారందరూ 20ఏళ్ళ లోపు వయస్సు వారే. అనంతరం వారు అక్కడ వేచి వున్న రెడ్‌క్రాస్ వాహనాల్లో వెళ్ళిపోయారు. మరోవైపు, ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్ 70మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే వారిని తిరిగి గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌కు వెళ్ళేందుకు అనుమతించడం లేదు. ఈజిప్ట్ ప్రభుత్వ కహెరా టివి ఈ మేరకు వెల్లడించింది. వారందరూ రాఫా సరిహద్దుల్లో ఈజిప్ట్ వైపునకు చేరుకుంటున్నారని తెలిపింది. హమాస్ చెరలో బందీగా వున్న సామాన్య మహిళ ఒకరు విడుదలై తమ వద్దకు చేరేవరకు పాలస్తీనా ఖైదీలను ఉత్తర గాజాలోకి తిరిగి వెళ్లనివ్వబోమని ఇజ్రాయిల్ తెలిపింది. అయితే యహూద్‌ను వచ్చే వారం విడుదల చేస్తామని తాము మధ్యవర్తులకు చెప్పామని హమాస్ సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఇది చిన్న విషయమేనని ఈజిప్ట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయినా ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదిలావుండగా, ప్రధాని నెతన్యాహు కార్యాలయం బందీల విడుదల కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయిల్ ఆర్మీ బేస్ వద్ద వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు అందులో వున్నాయి. శనివారం బందీల విడుదల వుందని తెలిసిన వెంటనే వారిని చూసేందుకు ఉదయం నుండే టెల్ అవీవ్‌లో, గాజా సిటీలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు లైవ్‌లో చూపిస్తూ ఇజ్రాయిల్ టివి ప్రసారం చేసింది. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి టివిలో మాట్లాడుతూ, యువతులైన ఆ నలుగురు బందీలను అలా ప్రదర్శనగా చూపించడాన్ని తీవ్రంగా నిరసించారు. గత ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ముగ్గురు బందీలు విడుదలయ్యారు. ఇందుకు బదులుగా 90మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు. వీరిలో అందరూ మహిళలు, పిల్లలే.