నాలుగు లేబర్ కోడ్ కోడ్ లు రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలి

– కార్మిక, రైతు సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, మూడు రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో  కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా నాలుగు కోడ్ లను తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ అలాగే మూడు రైతు నల్ల చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు కోడ్ లను రైతు మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల ప్రవేశ పెట్టిన పార్లమెంట్ బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రంకు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాకు బడ్జెట్ కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం కోసం మూతపడ్డ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం కోసం ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ను నిర్మించడం కోసం అదిలాబాద్ జిల్లాలో దేశంలోనే నాణ్యమైన తెల్ల బంగారం ప్రత్తి పంట పండుతది కాబట్టి టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి కొత్త ఇండస్ట్రీలను నిర్మించడం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టకపోతే జిల్లా ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం కోసం అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజాసంఘాలు, కార్మికులతో ప్రజలతో కర్శకులతో కార్యచరణ రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కోసం సిద్ధమవుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చప్పట్టానున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు సంఘాల జేఏసీ నాయకులు లోకారి పోశెట్టి, ఏఐకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్కా దేవిదాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కరదారపు అశోక్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సుభాష్, హరీష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ పాల్గొన్నారు.