– ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీలో చేరకుంటే తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి అన్నారు. ఆమె వ్యాఖ్యలు ఢిల్లీలో సంచలనంగా మారాయి. మంగళవారం నాడిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ నివాసాల్లో త్వరలోనే ఈడీ దాడులు జరుగుతాయని, అనంతరం తమను అదుపులోకి తీసుకుంటారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ”అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత ఆప్ పడిపోతుందని బీజేపీ ఊహించింది. కానీ రాంలీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవడాన్ని చూసి వారు భయపడ్డారు. త్వరలోనే మాకు సమన్లు? జారీ చేస్తారు. ఆపై జైల్లో పెడతారు. అయినా మేము బీజేపీకి భయపడటం లేదు. మా చివరి శ్వాస వరకు కేజ్రీవాల్‌తోనే పోరాడతాం. అందరినీ జైలులో పెట్టండి. అక్కడి నుంచే మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం” అని అతిషి అన్నారు.