– డి.ఎస్.పి శివరాం రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను బుధవారం కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామం వద్ద వేద ఫంక్షన్ హాల్ సమీపంలో పట్టుకున్నట్లు డి.ఎస్.పి శివరాం రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన పెద్దగోని అరవింద్, గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన సీత వంశీ, కొమ్ము అనిల్, కనగల్ మండలం గడ్డం వారి ఎడవెల్లి గ్రామానికి చెందిన చిన్న పాక అరుణ్ కుమార్ లు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు కనగల్ ఎస్సై బి. రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా నలుగురు వ్యక్తులు ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారని చెప్పారు. వీరి నుండి 40 వేల రూపాయల విలువచేసే కేజిన్నర గంజాయి, మోటార్ సైకిల్, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి శివరాం రెడ్డి చెప్పారు. పోలీసులు వారిని విచారించగా విశాఖపట్నం నుండి గంజాయిని కొనుగోలు చేసి కనగల్ చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముతున్నట్లు చెప్పారని ఆయన తెలిపారు. పెద్ద మొత్తంలో తెస్తున్న గంజాయిని 50 గ్రాములు, 100 గ్రాముల ప్యాకెట్లుగా తయారుచేసి 200 రూపాయలు, 500 రూపాయలకు విక్రయిస్తున్నారని డిఎస్పీ పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారమేరకు 20 మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మిషన్ పరివర్తన లో భాగంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని గంజాయి విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా, గంజాయి సేవిస్తున్నా వారి వివరాలను 81267 0266 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని డిఎస్పి శివరాం రెడ్డి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. గంజాయి కేసును చేదించిన చండూరు సిఐ ఏ. వెంకటయ్య, కనగల్ ఎస్సై బి. రామకృష్ణ, సిబ్బంది రమేష్, సురేష్, రైటర్ రమేష్, వెంకన్న, వీరయ్య, సర్ఫరాజ్ ఖాన్, వెంకట్ రెడ్డి, జానయ్యలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.