ఒక అడవిలో నక్క ఉండేది. అది ఎప్పుడూ తిక్కతిక్కగా తిరిగేది. ప్రతి వారిని మోసం చేయడమే దాని నైజం. ఇది ఇలా ఉండగా ఒకరోజు అత్యవసరంగా పది రూపాయలు అప్పు కావాల్సి వచ్చింది. పిల్లి వద్దకు వెళ్లి ”పిల్లి బావ! నాకు జర అర్జెంటుగా అవసరమున్నవి. ఓ పది రూపాయలు అప్పుగా ఇవ్వవా? జల్దిగానే నీ అప్పు తీరుస్తాను” అంది.
అందుకు పిల్లి ”వామ్మో! నిన్ను నమ్మడం ఎలా? నీ మాటలు వింటే నా పని అంతే! ఇవ్వను గాక ఇవ్వను. చిల్లి గవ్వ కూడా ఇవ్వను” అంటూ పిల్లి వెళ్లిపోయింది.
తర్వాత నక్క ఉడుతను అడిగింది. అందుకు ఉడత ”నువ్వు జిత్తుల మారిదానివి. నీకు గనుక అప్పిస్తే ఇంక అంతే సంగతులు. బూడిదలో పోసిన పన్నీరే” అని ఉడుత అన్నది. ఇట్లా నక్క చాలా జంతువుల్ని అడిగింది. కానీ రూపాయి కూడా అప్పు పుట్టలేదు. చేసేది లేక ఓచోట కూర్చుని అప్పిచ్చేవాళ్ళు ఇంకెవరున్నారబ్బా..! అని దీర్ఘంగా ఆలోచించింది. టక్కున దానికి భూదేవి గుర్తొచ్చింది.
భూదేవితో…. ”అమ్మా ..! అమ్మా ..! నాకు ఓ పది రూపాయలు అప్పు కావాలి. ఎవరిని అడిగినా నన్ను ఇసుమంత కూడా నమ్మడం లేదు. ఇస్తే మోసం చేస్తావని అందరూ అంటున్నారు. కనీసం నీవైనా నమ్ము. వారం రోజుల్లో నీ బాకీ తీరుస్తా” నక్క జాలిగా పలికింది. భూదేవి నక్క మీద జాలిపడి పది రూపాయలు అప్పుగా ఇచ్చింది.
పదిహేను రోజులు గడిచింది. నక్క అప్పు తీర్చలేదు. తప్పించుకు తిరుగుతూ వుంది. ఇక లాభం లేదనుకుని భూదేవి ”నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? వారం లోపల ఇస్తాను అంటివి. కనీసం కనిపించడం లేదు” అని నక్కను గట్టిగా మందలించింది.
నక్క మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుంది. నక్క ఎక్కడికి వెళ్లినా భూదేవి ప్రత్యక్షమై అప్పు గురించి అడుగుతూనే ఉంది. ఒకరోజు భూదేవి బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తన కంటికి ఓ చెట్టు కర్ర గుచ్చుకుంది. కన్నుకు గాయమైంది. చూపు పోయింది.
భూదేవి నక్కతో ”నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటావు?” అని కఠినంగా అడిగింది.
అప్పుడు నక్క ”నువ్వు ఎవరికి అప్పిచ్చావు? మంచి నక్కకా? లేకపోతే గుడ్డి నక్కకా?” అని అడిగింది.
”నేను మంచి నక్కకి అప్పు ఇచ్చాను”. అని భూదేవి బదులిచ్చింది.
”అయితే చూడు నాకు ఒక కన్ను లేదు. నేను గుడ్డి నక్కను. నువ్వు అప్పు ఇచ్చింది నాకు కాదు, పో..పో..” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క.
పాపం భూదేవికి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. చేసేది లేక మిన్న కుండి పోయింది.
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655