ఫ్రాన్స్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో బురఖాలపై నిషేధం

– సెప్టెంబరు 4 నుంచి అమలు
పారిస్‌ : ముస్లిం మహిళలు బురఖాపై ఫ్రాన్స్‌లోని మాక్రాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకప్పటి ఫ్రెంచ్‌ వలసకాలనీ నైగర్‌లో తన తొత్తు ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేజిక్కించుకోవడం, ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ దిగజారుతుండడం, కార్మికులు పెద్దయెత్తున సమ్మెలకు దిగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాక్రాన్‌ ప్రభుత్వం ఈ బురఖా అంశాన్ని తెరపైకి తెచ్చిందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిషేధం వర్తింప చేయాలని భావిస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి గాబ్రియెల్‌ అట్టల్‌ ప్రకటించారు. సెప్టెంబరు 4 నుంచి కొత్తగా విద్యా సంవత్సరం ఆరంభమవుతుండడంతో అప్పటి నుండే ఈ నిషేధం కూడా అమల్లోకి వస్తుందన్నారు. తరగతి గదిలో ఏ విధమైన మత చిహ్నాలు ఉండరాదన్న ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మితవాద పార్టీల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం మైనార్టీ ముస్లింలను టార్గెట్‌గా చేసుకుంటోందని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పూర్తిగా ముఖాన్ని కప్పేలా వేసుకునే ముసుగులపై 2010 ప్రారంభంలో నిషేధం విధించారు. 2004లో తలపై ధరించే స్కార్ఫ్‌ను నిషేధించారు.