అటు ఫ్రేజర్‌.. ఇటు అభిషేక్‌

అటు ఫ్రేజర్‌.. ఇటు అభిషేక్‌– రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్‌ పొరెల్‌(65), జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 201పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఛేదనలో భాగంగా రాజస్తాన్‌ ఓపెనర్లు జైస్వాల్‌(4), బట్లర్‌(19) నిరాశపరిచినా.. సంజు(86; 46బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో వివాదాస్పద క్యాచ్‌కు ఔటయ్యాడు. రియాన్‌ పరాగ్‌(27), దూబే(25), బట్లర్‌(19) ఫర్వాలేదనిపించినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిరాశపరిచారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుల్దీప్‌కు దక్కింది. ఢిల్లీ బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, ముఖేశ్‌కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి వికెట్‌కు ఫ్రేసర్‌, అభిషేక్‌ 4.1ఓవర్లలో 60పరుగులు చేసి గట్టి పునాది వేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50; 20బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో ఒకటే ఫోర్‌ కొట్టినా.. ఆ తర్వాత సందీప్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌లను ఉతికేశాడు. ఆవేశ్‌ వేసిన నాలుగో ఓవర్లో రెచ్చిపోయిన మెక్‌గుర్క్‌ వరుసగా.. 4, 4, 4, 6, 4, 6 బాది అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫ్రెజర్‌ కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీని కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో మరోదఫా ఫ్రెజర్‌ 20బంతుల్లోనే అర్ధసెంచరీని నమోదు చేశాడు.