ఎంఎన్‌సీలో ఉద్యోగమంటూ మోసం

– ప్రాసెసింగ్‌ పేరుతో రూ.2 వేలు వసూలు
– డేటా ఎంట్రీలో మిస్టేక్‌ చేశావంటూ రూ.1000 పెనాల్టీ
– వివిధ కారణాలతో రూ.5,73,208 స్వాహా
– బాధితుని ఫిర్యాదుతో సైబర్‌ నిందితుని అరెస్ట్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో
మల్టీ నేషనల్‌ కంపెనీలో ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం డీసీపీ కవిత వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బి.పవన్‌కళ్యాణ్‌ స్థానికంగా ఇంటర్‌నెట్‌ కేఫ్‌ నడిపేవాడు. ఇదే సమయంలో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండేవాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో సులువుగా డబ్బులు సంపాదించొచ్చనే ప్రకటనలు చూసి సైబర్‌క్రైమ్‌ నేరాలతో డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ‘టీక్యూఆర్‌ కంపెనీ’ పేరుతో ఓ నకిలీ కంపెనీ ఏర్పాటు చేశాడు. మల్టీ నేషన్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లేదా డేటా ఎంట్రీ వర్క్‌ ఇప్పిస్తానని, ఇంటి వద్దే డేటా ఎంట్రీ పూర్తి చేయొచ్చని ప్రకటనలు ఇచ్చాడు. వాటికోసం ఎవరైనా సంప్రదిస్తే తాను కన్సల్టెన్సీ మేనేజర్‌నంటూ పరిచయం చేసుకుని రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.2000 వసూలు చేసేవాడు. బాధితులకు నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ లేదా డేటా ఎంట్రీ వర్క్‌ పంపించేవాడు. బాధితులు వర్క్‌ పూర్తి చేసి తిరిగి పంపిస్తే ”మీరు చేసిన డేటా ఎంట్రీలో తప్పులున్నాయి” అంటూ పెనాల్టీ రూపంలో వేలల్లో డిపాజిట్‌ చేసుకునేవాడు. ఇలా వివిధ కారణాలతో బాధితుల నుంచి అందినకాడికి దండుకొని ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసేవాడు. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసిన పవన్‌.. ఎంఎన్‌సీలో ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నమ్మించాడు. రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.2000 ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. డేటా ఎంట్రీ వర్క్‌ను పంపించాడు. వర్క్‌ పూర్తయిన తర్వాత బాధితుడు ఆ డేటాను తిరిగి పంపించాడు. అయితే, వర్క్‌లో తప్పులున్నాయని అందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించాలని వసూలు చేశాడు. ఇదే తరహాలో వివిధ కారణాలు చెప్పి మొత్తం రూ.5,73,208 వరకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు, డేటా ఎంట్రీ వర్క్‌ ఇస్తామని ఎవరైనా ప్రకటనలు ఇచ్చినా, వర్క్‌ పంపించినా నమ్మొద్దని డీసీపీ కవిత సూచించారు.