షేర్ మార్కెట్ పేరుతో మోసం..

– రూ.30 లక్షల వరకు నష్టపోయిన యువత…?
నవతెలంగాన – దహేగాం
డాటా మీర్ యాప్ లో షేర్ మార్కెట్ కు పెట్టుబడి పెడితే డబ్బులు సంపాదించుకోవాలి అని యువకులకు ఆశ చూపించి కుచ్చుటోపి పెట్టిన డాటా మీర్ యాప్ బాగోతం  కుమురం భీం జిల్లా  బెజ్జూర్ మండలంలో బట్టబయలైంది.  గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యాప్ ద్వారా పెట్టుబడి పెడుతున్నామని, ఎక్కువ లాభాలు వచ్చాయని, కొందరు వ్యక్తులు ఆశ చూపించడంతో, అత్యాశలో పడ్డ యువత ఈ యాప్ ద్వారా బేజ్జూర్ మండలంలోని కూడా సలుగు పెళ్లి, తదితర గ్రామాలకు చెందిన వ్యక్తులు సుమారు రూ.30 లక్షల వరకు ఈ యాప్ లో డబ్బులు జమ చేశారు. డబ్బులు విత్డ్రా కాకపోవడంతో మోసపోయామని గమనించిన యువత లబోదిబోమంటున్నారు. గత ఆదివారం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒక్కరోజులోనే మరో లక్ష రూపాయలు కలిపి ఇస్తామని ఆశ చూపించడంతో, దీనికి ఆకర్షితులైన కొంతమంది లక్షల రూపాయలు ఈ యాప్ లో పెట్టుబడి పెట్టారు. మరునాడే డబ్బులు విట్రా కాకపోవడంతో మోసపోయామని గమనించారు. కుకుడలో సుమారు 20 మంది, బెజ్జూర్ లో పదిమంది, సలగుపల్లిలో పదిమంది యువకులు ఈ ఉచ్చులో చిక్కుకొని నష్టపోయినట్లు తెలుస్తుంది. తమకు న్యాయం చేయాలని గురువారం కొంతమంది సైబర్ క్రైమ్ ఆశ్రయించినట్లు తెలిసింది. ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కువ డబ్బులు వస్తాయని యువత ఈ ఉచ్చులో చిక్కుకొని నష్టపోయారు. కొందరు వ్యక్తులు బంగారాన్ని సైతం అమ్ముకొని దీంట్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది.