ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం

– లక్షల్లో వసూలు
– బాధితులను నమ్మించేందుకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు
– పాత నేరస్తుడు అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ మధ్య రైల్వే, ఆదాయపు పన్ను శాఖల్లో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలిపిస్తానంటూ అమాయకులను మోసం చేసి లక్షలు దండుకున్న పాత నేరస్తున్ని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ శనివారం వివరాలు వెల్లడించారు.. ఏపీ తెనాలికి చెందిన సూర్యదేవర అనిల్‌కుమార్‌ హైదరాబాద్‌ యాప్రాల్‌లో నివాసముంటున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే తక్కువ సమయంలో పెద్దఎత్తున డబ్బులు వస్తాయని పథకం వేశాడు. వివిధ గ్రూపులు, తెలిసిన వారు, స్నేహితుల ఫోన్‌ నెంబర్లతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించాడు. దాని ద్వారా అమాయకులను ఎంచుకుని టార్గెట్‌ చేసేవాడు. వారితో చాటింగ్‌ చేసి దక్షిణ మధ్యరైల్వే, పాట్నాలోని ఆదాయపు పన్ను శాఖల్లో పెద్దఎత్తున ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌, టీటీఈ తదితర బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నమ్మించాడు. నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో కలిసి ఒక్కో ఉద్యోగానికి రూ.5 నుంచి 10లక్షలు డిమాండ్‌ చేసేవాడు. డబ్బులిచ్చిన వారికి సూర్యదేవర అనిల్‌ కుమార్‌ నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ కాపీలు ఇచ్చేవాడు. ఆరు నెలల ట్రైనింగ్‌ పేరుతో మరికొంత డబ్బులు దండుకునేవాడు. ఇదే తరహాలో నగరానికి చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తిని టార్గెట్‌ చేసిన నిందితుడు.. వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చాడు. రైల్వే శాఖలో ‘టీటీఈ’ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10లక్షలు డిమాండ్‌ చేశాడు. డబ్బులు తీసుకున్న నిందితుడు.. బాధితున్ని పాట్నాకు పిలిపించి సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ‘టీటీఈ’గా ఉద్యోగం వచ్చిందని నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందించాడు. నవీన్‌ కుమార్‌ అనే టీటీఈ వద్ద ఆరు నెలలపాటు ట్రైనింగ్‌ చేయాలని చెప్పాడు. దాంతో బాధితుడు సికింద్రాబాద్‌కు చేరుకుని నవీన్‌ కుమార్‌ను సంప్రదించడంతో అతను అదనపు డబ్బులు డిమాండ్‌ చేశాడు. అనుమానం వచ్చిన బాధితుడు గోపాలపురం పోలీసులను ఆశ్రయించాడు. డీసీపీ రష్మీ పెరుమాళ్‌ ఆదేశాలతో నిందితుడిని అరెస్టు చేసి విచారించడంతో అతనిపై పలు కేసులున్నాయని తేలింది. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని చెప్పే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.