మోసాన్ని మోసంతోనే…

Fraud with fraud...ఆ రాజ్యంలో ఏడు ప్రధాన నగరాలున్నాయి. ఏడు ప్రధాన నగరాలకు ఒకేసారి పరిపాలనాధికారుల ఎన్నికలు జరపడానికి సైనిక దళం సరిపోవడం లేదని గమనించిన రాజుగారు రెండు నెలలకు ఒక ప్రధాన నగరంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నాడు .
అందువలన ఎన్నికల సమయాన ఆ నగరానికి కావలసిన సైనిక దళం పంపడం వలన ఎన్నికల గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరగసాగేవి.
ఆ ప్రధాన నగరంలో జరుగుతున్న ఎన్నికలలో పాము గుర్తు వారు, ముంగీస గుర్తు వారు ముఖ్యమైన పోటీదారులుగా వున్నారు.
పాము గుర్తు నాయకుడు కీచకయ్య ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని వ్యూహం పన్నసాగాడు. మూర్ఖపు ఆలోచనను అందించే సలహాదారుడితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తెలివైన సలహా ఇచ్చిన ఆ సలహాదారుడికి వజ్రాలు బహూకరించాడు కీచకయ్య. తప్పకుండా ఈ ఎన్నికలల్లో అత్యధిక ఓట్లతో గెలుస్తానన్న ఆనందం, గర్వం ఏర్పడింది.
ఎన్నికలకు ముందు రోజు కీచకయ్య తన మనుషులతో ఇంటింటికి వెళ్ళాడు. ఓటుకు నాణెం అంటూ తమకే ఓటు వేయమని బంగారు నాణెం ఇవ్వసాగాడు. పాము గుర్తుకు మద్దతు తెలిపే వారింటికి కూడా వెళ్లి బంగారు నాణెము ఇవ్వడంతో పాటు వారు ఓటు వేయడానికి వీలులేకుండా వాళ్ల వేలికి పచ్చ ఇంకు వేశారు.
నగరమంతా తాము అనుకొన్నవిధంగా ఓటుకు నాణెం ఇచ్చిన తరువాత కీచకయ్య ‘తెలివితో మోసం చేసాను ఇక గెలుపు నాదే’ అన్న సంతోషంతో పడుకొన్నాడు.
ఆ రాత్రి ముంగీస గుర్తు నాయకుడు మహిశాసురయ్యకు ఆ సంగతి తెలిసింది. ఎన్నికలు జరగడానికి కొద్ది గంటలే వుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే తన సలహాదారులను పిలిపించి అత్యవసర సమావేశం జరిపించాడు. ఆ సలహాదారులు చెప్పిన విధంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్నికలు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఆ సాయంత్రం నుండే ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మరుసటి రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.
ఓటుకు బంగారు నాణెం ఇచ్చిన కీచకయ్య అతితక్కువ ఓట్లు తెచ్చుకొని చిత్తుగా ఓడిపోవడం అతనికి ఆశ్చర్యం బాధ కలిగించింది. ”ఎంతో తెలివితో మోసం చేసిన నేను ఎలా ఓడిపోయాను” అంటూ కోపంగా తన సలహాదారుని అడిగాడు?
అన్నివిధాలా విచారించి ”అయ్యా కీచకయ్యా, మనం ఆ గుర్తు మనుషులు ఓటు వేయడానికి వీలు లేకుండా వేలిపై పచ్చ ఇంకు గుర్తు వేసాం. ఆ సంగతి మహిషాశురయ్యకు తెలిసింది. తన మనుషులు ఓటు వేయడానికి వీలుగా వేలుకు తొడుగులు ఏర్పాటు చేసి వేలుకు వేయడంతో పచ్చగుర్తు కనపడలేదు. ఓటువేసి వచ్చారు. అంతే కాదు ఎక్కువ సొమ్ము మన గుర్తుకు వేసే మనుషులకు కూడా ఇచ్చి వాళ్లకు ఓటు వేసేలా చేశారు” అని సమాధానం ఇచ్చాడు.
‘మోసాన్ని మోసంతోనే జయించాడు’ అని బాధగా అనుకొన్నాడు కీచకయ్య

– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026