– ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా…
– పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్,ఆర్డినరీ, మెట్రోలైనర్‌లు ఎక్కొచ్చు
– రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు
– నివాస గుర్తింపు కార్డు చూపాలి
– పురుషులు, విద్యార్థులకోసం స్పెషల్ బస్సులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి నేటి మధ్యాహ్నం 1.40 గంటలకు అసెంబ్లీ ఆవరణ నుంచి ఈ బస్సు సర్వీసుల్ని ప్రారంభిస్తారు. ఆయనతోపాటు మహిళా మంత్రులు అనసూయ సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రవాణాశాఖ కార్యదర్శి వాణీ ప్రసాద్‌తో పాటు పలువురు మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విధివిధానాలపై కసరత్తు చేశారు. అనంతరం రవాణాశాఖ కార్యదర్శి వాణి ప్రసాద్ దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ సిటీలో ఆర్డినరీ, మెట్రోలైనర్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనిపై సజ్జనార్ బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. ఉచిత ప్రయాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్‌లు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే వర్తిస్తుందనీ, దానికోసం బస్సులో కండక్టర్‌కు స్థానికత ధృవీకరణ కోసం ఆధార్‌కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు వంటివి చూపితే సరిపోతుందని వివరించారు. ఇన్ని కిలోమీటర్లే ప్రయాణ పరిధి అనే నిబంధనలు ఏమీ లేవన్నారు. రాష్ట్ర సరిహద్దుల వరకు మహిళలు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగినులు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. వారం తర్వాత బస్సుల్లో ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ ఇస్తామన్నారు. రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో లెక్క తేలాల్సి ఉంటుందనీ, ఆ ప్రకారమే ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్ సొమ్ము చెల్లిస్తుందని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఈ నిర్ణయం అమలు కోసం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో ఇప్పటికే రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నదనీ, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలనీ, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీకి ప్రస్తుతం రోజుకు రూ.14 కోట్ల ఆదాయం వస్తున్నదనీ, ఇప్పుడు దానిలో సగం ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నామనీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. ఇప్పటికే ఆర్టీసీలోకి 776 కొత్త బస్సులు వచ్చాయనీ, త్వరలో మరో 1,050 బస్సులు, వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. డ్రైవర్ల అవసరం ఉన్నదని ప్రభుత్వానికి నివేదించామనీ, దానికి సంబంధించి రిక్రూట్‌మెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వ్యక్తిగతంగానే తప్ప, టూర్ ప్యాకేజీలకు ఈ స్కీం వర్తించదని స్పష్టంచేశారు. వారం రోజులు అధ్యయనం చేశాక, అవసరమైతే పురుషులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణీకుల్లో 40 శాతం మహిళా ప్రయాణీకులు ఉన్నారనీ, వారి సంఖ్య ఇప్పుడు 55 శాతానికి పెరుగుతుందని అంచనా వేశామన్నారు. రద్దీని బట్టి షెడ్యూల్స్ సంఖ్య కూడా పెంచుతామన్నారు. ఇప్పటికే బస్ పాసులు తీసుకున్న మహిళలు, విద్యార్థినులకు ఎలాంటి రీయింబర్స్‌మెంట్ ఉండబోదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్ వీ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, కష్ణకాంత్, వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన్‌ప్రసాద్ పాల్గొన్నారు.