– నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక..
– పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రం..
– ఆలయ గోవుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ & జిల్లా కలెక్టర్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ దేవస్థానం గోశాలలోని కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పాపూర్ వేములవాడ దేవస్థానం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడెల, ఆవుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ..దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడ నుంచో వేములవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోడె కడుతారని తెలిపారు. ప్రతి నిత్యం భక్తుల కోలాహలంతో స్వామి, అమ్మ వార్ల దర్శనం తో పాటు కోడె మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వేములవాడ దేవస్థానం గోశాలలో 400 గోవుల సామర్థ్యం ఉందని, కానీ ప్రస్తుతం అందులో 1500 పైగా కోడెలు, గోవులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని అర్హులైన పేద రైతులకు, ఇతర గోశాలలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరువతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు.
గోశాలలో కోడెల సంరక్షణకు వసతులు కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని , గోశాలలో అదనపు షెడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. గోశాలలో డ్రైనేజీ వ్యవస్థ ఇతర సౌకర్యాల కల్పనకు దేవాదాయ శాఖ ద్వారా అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలు, ఆవులు ఇతరత్రా పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు.
