వ్యవసాయ పంపులు నడవాలంటే త్రీ ఫేస్ సరఫరా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.35వేల కోట్ల బాకీ ఉన్నది. సబ్సిడీల డబ్బులు డిస్కంలకు చెల్లించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు గుది బండగా మారాయి. సుమారు రూ.25వేల కోట్లు ఇరిగేషన్ పథకాలు, లిఫ్టు పథకాలు, కలెక్టరేట్ల విద్యుత్ బకాయిలు, వ్యవసాయ ఉచిత విద్యుత్తు డబ్బులు డిస్కంలకు చెల్లించవలసి ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థలు బాగున్నంత సేపు వాడుకోవడం కేసీఆర్, బీఆర్‌ఎస్ విధానంగా కనబడు తున్నది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని, సింగరేణి బాగా తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నది. ఆర్టీసీని గాలికొదిలేసింది. ఇక కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు ఒక గంటకు ఎకరం పారుతుందా? బోరు బావినా, ఉపరితల బావులా, వాగు నుండా, భూగర్భజలాల లెవల్స్ తదితర నీటి వనరుల లభ్యతను బట్టి, భూమి స్వభావం ఎర్ర నేలలు, నల్లరేగడి, శవుక భూములు, సౌడ్ భూములు తదితర భూ స్వభావలను బట్టి, పంట స్వభావాన్ని బట్టి నీటి పారకానికి పెట్టె సమయం ఉంటుంది. వరి పంట ఒక ఎకరా సాగుకు 5హెచ్‌పీ కెపాసిటీ మోటారు రోజుకు సగటున రెండు గంటలు అవసరం పడుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి త్రీఫేస్ విద్యుత్ సరఫరా డేటైంలో పూర్తిగా ఉంటుంది. సాయంత్రం 5.35 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు. అంటే వ్యవసాయానికి అవసరమైన త్రీ ఫేస్ పవర్ సరఫరా సుమారు 18గంటలు అవుతుంది. గృహ, కమర్షియల్ అవసరాలకు 24గంటల సరఫరా జరుగు తుంది. పీక్ లోడ్ హవర్స్ ముఖ్యంగా సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు వ్యవసాయానికి ఉపయోగపడే త్రీ ఫేస్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, కాంగ్రెస్ పాలనలో వ్వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఏడుగంటలు మాత్రమే ఇచ్చేవారు. రాత్రి పూట నాలుగు గంటలు, డే టైం మూడు గంటలు సరఫరా చేసేవారు. మధ్య మధ్యలో అనేకసార్లు విద్యుత్తు సరఫరాలో కోతలు విధించేవారు. అప్పుడు ఎంతోమంది రైతులు చీకట్లో బావులు, బోర్ల దగ్గరికి వెళ్తూ కరెంటు షాక్ గురై చనిపోయిన సందర్భాలు అనేకం. రాత్రుళ్లు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక మోటర్ల వద్ద రైతులు పడిగాపులు కాసేవారు. ఈ విషయంలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎంత బుఖాయించాలని చూసినా దాస్తే దాగని నిజం. వ్యవసాయ బావులు, బోర్ల మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేస్తున్నది. ఏపీలోని జగన్ ప్రభుత్వం మీటర్లు బిగించడానికి అంగీకరించింది. ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించబోమని చెప్పింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. 2022 విద్యుత్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలపాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ పేటెంటా! అయితే యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎందుకివ్వడం లేదు? ఉచితాలకు, సబ్సిడీలకు వ్యతిరేకమైన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ సారధ్యంలో 1991లో ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ ఉమ్మడి ఏపీలో వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్తు తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు.
దీనికి నేపథ్యం ప్రపంచబ్యాంకు ఏజెంట్‌గా మారిన చంద్రబాబు విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, విద్యుత్ బోర్డును మూడు ముక్కలు చేశాడు. ప్రజలపై విపరీతమైన విద్యుత్ చార్జీల భారం మోపాడు. సంస్కరణలు, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో 2000లో పెద్దయెత్తున ప్రజా ఉద్యమం నడిచింది. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు 45మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వందలాది మంది గాయపడ్డారు. వేలాది మందిపై కేసులు పెట్టారు. విద్యుత్ పోరాటం నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్ వాగ్దానం చేసింది. 2004 ఎన్నికలలో ప్రయోజనం పొందింది. అధికారంలోకి వచ్చింది. నూతన ఆర్థిక విధానాలను, ప్రభుత్వ రంగసంస్థల ప్రయివేటీకరణను, ఈ విధానాల ఫలితంగా ప్రజలపై పడుతున్న పెనుబారాలపై నిక్కచ్చితంగా పోరాడుతున్నది వామపక్షాలు మాత్రమే.
విద్యుత్ (సవరణ)చట్టం-2022 బిల్లును ఆగస్టు 2022లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి పంపారు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో (జులై 2023లో) బిల్లును సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లులోని అనేక అంశాలు విద్యుత్ వినియోగ దారులకు తీవ్రంగా నష్టం చేసేవిగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ లైన్లను, 33/11 కెవి సబ్ స్టేషన్‌లను పోటీ పేరుతో ప్రయివేటీకరించడం, వ్యవసాయానికి, గృహ, కమర్షియల్ వినియోగాలకు స్మార్ట్, ప్రీ-పెయిడ్ మీటర్లు బిగించడం, పీక్‌లోడ్ హవర్‌లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు వసూలు చేయడం వంటివి ఉన్నాయి. ఉదాహరణకు ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ విని యోగం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఉపయోగించుకున్న విద్యుత్ యూనిట్ కాస్ట్ అధికంగా వసూలు చేయలనేది కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానంగా ఉన్నది. యూనిట్ ధర సుమారు 12 రూపాయలు ఉండే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. తాము చెప్పినట్లుగా వినియోగదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ద్వారా సబ్సిడీ చెల్లింపు, ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయివేటీ కరణ తదితర విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 0.5శాతం అదనంగా అప్పులు చేసుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తామని ప్రలోభ పెడుతుంది.
ఈ సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఇతర డిమాండ్లపైన ఆయా రాష్ట్రాలలో మూడు లేదా నాలుగు రోజులపాటు సమ్మెలు చేశారు. ఆ ప్రభుత్వాలను ఒక్క అడుగు వెనక్కొట్టగలిగారు. పాలక వర్గ పార్టీలు అధికారంలో ఏవి ఉన్నా ప్రజా వ్యతిరేక విధా నాలు అమలు చేస్తున్నాయి. రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు, బొగ్గు గనులు ఒకటేమిటి సర్వం ప్రయివేటికరణ చేస్తూ పెట్టుబడుదాలకు కారు చౌకగా ప్రజా ఆస్తులను కట్టబెడుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజా ఆస్తులను రక్షించుకోగలం.
గీట్ల ముకుందరెడ్డి
9490098857