నవతెలంగాణ-సంగారెడ్డి
దళితులకు ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్న 101యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అన్ని దళిత కుటుంబాలకు అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎఎస్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని విద్యుత్ జిల్లా కార్యాలయం ఎస్‌ఈ ఆఫీస్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈకి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ.. నేడున్న పరిస్థితుల్లో విద్యుత్ అనేది అత్యంత ముఖ్యమైనదన్నారు. ప్రస్తుతం దళితులకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇచ్చే 342 జీవో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. దీంతో దళిత లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా దళితులకు ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటికీ.. రాష్ట్రంలో ఎక్కడ సరిగా అమలు కావడం లేదన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే అమలుకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకుంటే కేసులు నమోదు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. దళితులపై విద్యుత్ అధికారుల వేధిం పులు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో విద్యుత్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.101యూనిట్ల విద్యుత్ వర్తిస్తుందని దళితులకు అవగాహన కల్పించాలన్నారు. ఢిల్లీలో 300 యూనిట్లు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 200 యూనిట్ల వరకు దళితులకు ఉచిత విద్యుత్ అమలులో ఉన్నదని.. కాబట్టి మన రాష్ట్రంలోనూ ప్రతీ దళిత కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇవ్వా లన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పి.అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశం, దాసు, ప్రభాకర్, దివాకర్, సుధాకర్, నర్సింలు, నాయకులు శివ కుమార్, ఆనంద్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.