నిమ్స్‌ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్‌ క్యాంపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్‌ క్యాంపును ఈ నెల ఒకటి నుంచి ప్రతి రోజు నిర్వహిస్తున్నట్టు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, ఆ విభాగాధిపతి డాక్టర్‌ పార్వతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 9 వరకు ఈ క్యాంపును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పిల్లలకు సంబంధిచి మొర్రి (క్లెఫ్ట్‌), క్రానియో ఫేషియల్‌ అసామాన్యతలు, పుట్టుకతో హస్త విపత్తులు, పక్షవాతం, కాలిపోయిన, ప్రమాదానంతరం ఏర్పడిన వైకల్యతలు, రక్తనాళ అసామాన్యతలు, 12-14 సంవత్సరాల్లోపు పిల్లల్లో ఉన్న ఇతర లోపాలను ఈ క్యాంపులో గుర్తించనున్నట్టు తెలిపారు. వారికి ఉచిత శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య శ్రీ , సీఎంఆర్‌ఎఫ్‌ , ఎల్‌ఓసి ద్వారా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని వివరించారు. అవసరమున్న వారు నిమ్స్‌ ఆవరణలోని పాత ఓపీడీ బ్లాక్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకుని రూమ్‌ నెంబర్‌ 8లో డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9393835845, 040-23489049 నెంబర్లలో సంప్రదించవచ్చు.