ఉచిత పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

– పాడి రైతులకు సబ్యసాచి ఘోష్‌ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పాడి రైతులు పాల ఉత్పత్తిలో గణనీయ ప్రగతిని సాధించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ అభినందించారు. శుక్రవారం సచివాలయంలో ఉచిత పశువైద్య శిబిరాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 1980 కోట్లు సీఎం రేవంత్‌రెడ్డి కేటాయించారని గుర్తు చేశారు. ‘రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌’ సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2210 ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాల్లో దీర్ఘకాలికంగా ఎదకు రాకుండా గర్భం దాల్చని పశువులను గుర్తించి, వాటికి తగు చికిత్స చేయడం, ఎదలో ఉన్న పశువులలో కృత్రిమ గర్భధారణలు చేయడం, చూడి పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు, విటమిన్‌ ఇంజెక్షన్లు, పాడి పశువులలో పాల దిగుబడి పెంచేందుకు ఖనిజ లవణ మిశ్రమాలను అందించడం, ఇతర చికిత్సలు చేస్తామన్నారు. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రదర్శన, పాడిపశువుల్లో పాల దిగుబడి పోటీలు నిర్వహించి రైతులకు కృత్రిమ గర్భధారణపై, అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పాడిపశువులపైన అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. చూలు నిలువక మళ్ళీ మళ్ళీ ఎదకు వచ్చే పశువుల్లోని గర్భకోశ వ్యాధులకు కూడా సకాలంలో చికిత్స చేయించడం వంటి విషయాల ప్రాధాన్యతను వివరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలు, దూడల ప్రదర్శన, పాడిపశువులలో పాల దిగుబడి పోటీలను పాడి రైతులు సద్వినియోగం చేసుకొవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు సమీప గోపాల మిత్ర, పశువైద్య పశువైద్యాధికారి, కార్యనిర్వహణాధికారి, ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థను సంప్రదించాలని కోరారు.