నెత్తుటి మరకల ‘స్వాతంత్య్రం’

నెత్తుటి మరకల 'స్వాతంత్య్రం'‘మహిళ అర్థరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం’ అన్నారు గాంధీజీ. ఆయనకన్న కలలు నెరవేరుతాయా, లేదా అనేది అటుంచితే నేడు ఎటువైపు నుంచి మానవమృగాలు దాడిచేస్తాయోనన్న భయాందోళన మహిళల్ని అనుక్షణం వెంటాడుతోంది. ఇంట్లో, ఆఫీసుల్లో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్న మహిళలకు సరైన భద్రత ఉందా అన్న ప్రశ్నకు సమాధానం సమాధానం దొరకడం గగనమైంది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్‌ దిశ, హత్రాస్‌, ఉన్నావ్‌ ఘటనల్ని తలచుకుంటే చాలు, మన దేశం ఎటుపోతోందో? ఎలాంటి ప్రమాదకర స్థితిలో ఉందో అర్థమవుతోంది. దీనిక కారణాల్ని అన్వేషిస్తే ముందుగా దోషుల స్థానంలో నిలబడాల్సింది కేంద్ర పాలకులు. ఎందుకంటే మణి పూర్‌లో నడిరోడ్డుపై మహిళలను నగంగా ఊరేగించడం నుంచి మొదలుకుంటే మొన్నటి కలకత్తా మెడికోపై లైంగికదాడి, హత్య వరకు అన్నీ అమానుష ఘటనలే. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసేవే. ఈ ఉదంతాలన్నీ ఒకదాని మించి ఒకటి జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. తమిళనాడులో బాలికపై, మహారాష్ట్రలో నర్సుపై, తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి. ఇలా దేశంలో ప్రతిరోజూ ఏదో ఓచోట మహిళలపై దారు ణాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇందులో తెలియనవి కొన్నయితే, కాలగర్భంలో కలిసేవి మరెన్నో! దేశంలో పది నిమిషాలకు ఒక లైంగికదాడి జరుగుతోందని జాతీయ నేర గణాంకాల నివేదిక పేర్కొంది. ప్రతి పది నిమిషాలకు ఓ ఆడ శిశువు, ఓ బాలిక, ఓ స్త్రీ, ఓ వృద్ధురాలు అన్యాయంగా సామూహిక లైంగికదాడికి బలవుతూనే ఉన్నారని చెప్పడానికి సర్కారు నమోదు చేసిన ఈ నేర గణాంకాలే సాక్ష్యం. పదేండ్ల కిందట ఇరవై నిమిషాలకు ఒక రేప్‌ జరిగితే…ఇప్పుడది పది నిమిషాలకు చేరింది. అంటే, మోడీ తన దశాబ్ద పాలనలో సాధించిన ప్రగతి ఇదేనా? అని నేడు మహిళాలోకం ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘట నలు జరిగినప్పుడు భరోసా కల్పించాల్సిన పాలకులు స్పందిస్తున్న తీరు మరింత వెగటు పుట్టిస్తోంది. వారి మాటలే మహిళలపై దాడులకు పురిగొల్పుతున్నాయా? అన్న సందేహం కలుగుతోంది.
ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తరువాత మహిళల భద్రతపై ప్రత్యేకంగా ఏర్పాటైన జస్టిస్‌ వర్మ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో హత్యాచార నిర్వచనాన్ని మరింత విస్తృతపరచడమే కాదు, అటువంటి అకృ త్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వుండాలని సూచించింది. ఐపీసీని సవరించాలని చెప్పింది. ఈ సిఫారసుల్లో ొన్నింటిని మాత్రమే స్వీకరించిన ప్రభుత్వం నిర్భయ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఆ తరువాత దానికి చట్టరూపమిచ్చింది. అయినా, మహిళలపై లైంగికదాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చట్టాలు తమనేమీ చేయలేవన్న మొండిధైర్యమో, తప్పుచేసినా శిక్ష పడకుండా తప్పించుకోవచ్చన్న ధీమానో తెలియదుగానీ, మోడీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళల్ని రక్షిం చేందుకు, వారికి భరోసా కల్పించేందుకు సర్కారు చర్యలు శూన్యం. మాటల్లోనే మహిళలంటే తనకెంతో గౌరవమని, శక్తి స్వరూపిణి అంటూ కీర్తిస్తున్న మన ప్రధాని ఇలాంటి దాడులు జరిగినప్పుడు మౌన ముద్రలోనే ఉంటారు. ఉన్నావో, హత్రాస్‌ వంటి ఘటనలపైనా కూడా ఆయన నోరువిప్పలేదు. మణి పూర్‌ మారణకాండపై కూడా ఇంతే. ఢిల్లీ నిర్బయ ఘటన సమయంలో మహిళలపై కాషాయ పరివారం ఎక్కడలేని ప్రేమను ఒలకపోసింది. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన తర్వాత ఏం జరుగుతోందో దేశ మంతా నేడు కండ్లారా చూస్తోంది, ఇంకా చెప్పాలంటే బాధను అనుభవిస్తోంది. ’78 ఏండ్ల స్వాతంత్య్ర మా..నాకు స్వేచ్ఛెక్కడా?’ అని రోదిస్తోంది.
గృహ బంధనాలను, పురుషాధిక్యతను ఛేదించుకొని మహిళలు బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో తమ ప్రతిభా సామర్థ్యాలను చాటుకుంటున్న సందర్భంలో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ సమయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై మహిళలు ఫిర్యాదు చేస్తున్నా న్యాయం మాత్రం దొరకడం లేదు. మహిళలను గౌరవించే దేశం మనదని సూక్తులు వల్లించే మోడీ.. తమ పార్టీ నేతలు, కీలకపదవుల్లో ఉన్న కాషాయ ప్రజాప్రతినిధులే మహి ళలపై దాడులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినా మహిళలకు సరైన రక్షణ లేదు. ఆడపిల్లలపై అకృత్యాలకు తెగబడుతోన్న కీచకులను శిక్షించలేనప్పుడు అది చట్టబద్ధమైన పాలన అనగలమా? ఎన్ని చట్టాలు తెచ్చినా, మరెన్ని రూల్స్‌ రూపొందిం చినా వాటిని ఆచరణలో పెట్టనప్పుడు ఉపయోగమేంటి? చట్టాలు చేస్తే చాలదు, వాటిని నిజాయితీగా అమలు చేసే యంత్రాంగం కావాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రభుత్వ ధోరణిలో మార్పు రావాలి. ఎన్నుకున్న పాలకులు పూర్తి భరోసా కల్పించినప్పుడే మహిళలకు నిజమైన స్వేచ్ఛ.దానికోసం మహిళలే కాదు, వారికి మద్దతుగా పౌర సమాజమంతా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.
– జీవీఎంఆర్‌